- District News
- గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి
గణేష్ మండపాల నిర్వాహకులతో శాంతి సమావేశం.
లోకల్ గైడ్/బంట్వారం
గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని బంట్వారం మండల ఎస్సై విమల సూచించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న గణేష్ మండపాల నిర్వాహకులతో ఆదివారం ఆమె శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై విమల మాట్లాడుతూ.. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు, ప్రజాశాంతికి ఎలాంటి విఘాతం కలగకుండా నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గణేష్ మండపాల వద్ద భక్తులకు, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా అధిక శబ్దాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించే డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణలో పోలీసులకు నిర్వాహకులు సహకరించాలని కోరారు. నిమజ్జనం రోజున ఎవరూ మద్యం సేవించకుండా భక్తిశ్రద్ధలతో భజనలు, కీర్తనలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించాలని ఎస్సై విమల సూచించారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. సమావేశంలో ఆయా గ్రామాల గణేష్ మండపాల నిర్వాహకులు, గ్రామ యువకులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
