- District News
- తట్టేపల్లి అడవిలో ‘పులి’ సంచారం
తట్టేపల్లి అడవిలో ‘పులి’ సంచారం
అడవిలో పెద్ద శబ్దాలతో రైతులు, స్థానికుల్లో ఆందోళన. - అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించాలని రైతుల విజ్ఞప్తి.
లోకల్ గైడ్/తాండూర్:
అడవిలో వినిపించిన పెద్ద శబ్దాలు.. పులి సంచరిస్తుందన్న అనుమానాలతో పొలాలకు వెళ్లాలన్నా, పశువులను మేతకు తీసుకెళ్లాలన్నా రైతులు, స్థానికులు జంకుతున్న పరిస్థితి నెలకొంది. పెద్దేముల్ మండల పరిధిలోని తట్టేపల్లి పరివాహక ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...తట్టేపల్లి పరివాహక ప్రాంతంలోని శ్రీ అంబరామేశ్వర దేవాలయం పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జయరాం తండా (ఓ)కు చెందిన కొంతమంది రైతులు పశువులను మేత కోసం అడవిలోకి తీసుకెళ్లిన సమయంలో మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో అడవిలో పెద్ద శబ్దాలు వినిపించినట్లు తెలిపారు. దీంతో అక్కడ పులి సంచరిస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సమాచారం స్థానికుల్లో వ్యాపించడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు, పశువులను మేతకు తీసుకెళ్లేందుకు, అటవీ ప్రాంతం వైపు వెళ్లేందుకు భయపడుతున్నారు. అయితే పులి సంచారం అధికారికంగా నిర్ధారణ కాలేదు.
అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రాంతాన్ని పరిశీలించి, అవసరమైన నిఘా చర్యలు చేపట్టాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు.
