ఘనంగా చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన.

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు.. ప్రత్యేక పూజలు చేసిన

ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి.
Published On
ఘనంగా చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన.

లోకల్ గైడ్/తాండూర్:
 పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామంలో వెంకట చెన్నకేశవ స్వామి ఆలయ పునర్నిర్మాణ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మూడు రోజులుగా కొనసాగిన ఉత్సవాల్లో భాగంగా సోమవారం చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఉత్సవాల్లో భాగంగా తొలి రెండు రోజులు ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని డప్పు వాయిద్యాల నడుమ గ్రామంలో ఊరేగించారు. అనంతరం విగ్రహానికి జలాధివాసం, ధాన్యాధివాసం కార్యక్రమాలను నిర్వహించారు. చివరి రోజైన సోమవారం మూలమంత్ర హోమం, శయ్యాధివాసం, యంత్ర స్థాపన తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించి చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హాజరై చెన్నకేశవ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ ఆవరణలో నాగదేవత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆడపడుచులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గాజీపూర్ గ్రామంలో సందడి నెలకొంది. ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హేమాలత లాల్ రెడ్డి, గ్రామ పెద్దలు నారాయణరెడ్డి, నసీర్, లాల్ రెడ్డి,వీరప్ప,వెంకటేష్ చారి, ప్రకాష్ రెడ్డి,యువకులు,చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News