- District News
- Hyderabad
- మొబైల్‌తోనే సృజనకు రెక్కలు!
మొబైల్‌తోనే సృజనకు రెక్కలు!
యువతలో సృజనాత్మకతకు మొబైల్ ఫిల్మ్‌మేకింగ్ కొత్త వేదిక
టాస్క్ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ.. 56 మంది విద్యార్థులకు ధ్రువపత్రాల అందజేత
Published On
By Ram Reddy
విద్యార్థుల్లో ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు సృజనాత్మకతను వెలికితీసే లక్ష్యంతో హైదరాబాద్‌లోని టాస్క్ కార్యాలయంలో “మొబైల్ ఫిల్మ్‌మేకింగ్ అండ్ సినిమాటోగ్రఫీ” పేరుతో ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కళాశాలలకు చెందిన 56 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మొబైల్ ఫిల్మ్‌మేకింగ్, ఫొటోగ్రఫీ ప్రాథమిక అంశాలు, కెమెరా సాంకేతికత, చిత్రీకరణలో ఫ్రేమింగ్, వెలుతురు వినియోగం, దృశ్య కథనం, ప్రాథమిక సినిమాటోగ్రఫీ తదితర అంశాలపై విద్యార్థులకు ప్రాయోగిక శిక్షణ అందించారు. స్మార్ట్‌ఫోన్‌తోనే నాణ్యమైన దృశ్యాలను రూపొందించడం, కథను ఆకట్టుకునే విధంగా చిత్రీకరించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన టాస్క్ ముఖ్య నిర్వహణాధికారి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి ఆసక్తులు, శిక్షణలో నేర్చుకున్న అంశాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సాంకేతికత యువతకు అనేక కొత్త అవకాశాలను అందిస్తోందన్నారు. ఒకప్పుడు చిత్రీకరణ, ఫొటోగ్రఫీకి ఖరీదైన కెమెరాలు, ప్రత్యేక పరికరాలు అవసరమయ్యేవని, ప్రస్తుతం చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తోనే మంచి ఆలోచనను, కథను, దృశ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉందన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రాయోగిక నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఫొటోగ్రఫీ, చిత్రీకరణ, కంటెంట్ రూపకల్పన వంటి రంగాల్లో ప్రతిభను పెంపొందించుకుంటే భవిష్యత్తులో ఉపాధితో పాటు స్వయం ఉపాధి అవకాశాలను కూడా అందిపుచ్చుకోవచ్చన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టాలని, నిరంతర సాధనతో సృజనాత్మకతను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు.
అనంతరం శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 56 మంది విద్యార్థులకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేతుల మీదుగా ధ్రువపత్రాలను అందజేశారు. విద్యార్థులతో కార్యక్రమంపై చర్చించి వారి భవిష్యత్ లక్ష్యాలను కూడా తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో చిత్రీకరణ శిక్షకుడు రోషన్, టాస్క్ ప్రతినిధుల బృందం, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Oct 2026 14:55:06
మాజీ సర్పంచ్ సుందరి అనిల్ పై సంచలన ఆరోపణలు
