- District News
- లక్ష్మారెడ్డిపల్లిలో ఐక్యత చాటిన గ్రామస్తులు.. వైభవంగా వనభోజనాలు!
లక్ష్మారెడ్డిపల్లిలో ఐక్యత చాటిన గ్రామస్తులు.. వైభవంగా వనభోజనాలు!
పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని పొలిమేరల్లో కీడు వంటలు
భూపాలపల్లి: (లోకల్ గైడ్ ప్రతినిధి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం
మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో గురువారం గ్రామస్తులంతా ఏకమై సంప్రదాయబద్ధంగా వనభోజనాల మహోత్సవాన్ని నిర్వహించారు. గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ గ్రామస్తులు ఏటా వచ్చే ఆనవాయితీని కొనసాగించారు.
తెల్లవారుజామునే గ్రామ ప్రజలంతా ఇళ్లను విడిచి కుటుంబ సమేతంగా గ్రామ పొలిమేరలకు తరలివెళ్లారు. గ్రామ సంప్రదాయం ప్రకారం ఉదయాన్నే ఇళ్ల ముంగిట కల్లాపు చల్లకుండా, ముగ్గులు వేయకుండా గ్రామ పొలిమేరల్లో కీడు వంటలు నిర్వహించారు. చిన్నా పెద్దా, ఆబాలగోపాలం కుటుంబ సమేతంగా పొలిమేరలకు చేరుకుని అక్కడే వంటవార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు.
అనంతరం రోజంతా చిన్నారులు, మహిళలు, పెద్దలు ఆటపాటలతో, సరదా ముచ్చట్లతో అత్యంత ఉత్సాహంగా గడిపారు. సాయంత్రం వరకు వనభోజనాల్లో ఆనందంగా గడిపిన గ్రామస్తులు, అనంతరం తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు. దీంతో లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
