- District News
- అంతర్‌రాష్ట్ర వాహన దొంగ అరెస్ట్.. రూ.10 లక్షల విలువైన కార్లు, బైక్ స్వాధీనం
అంతర్‌రాష్ట్ర వాహన దొంగ అరెస్ట్.. రూ.10 లక్షల విలువైన కార్లు, బైక్ స్వాధీనం
కుకునూర్‌పల్లి పోలీసుల చాకచక్యం.. క్యాబ్ డ్రైవర్లను
సిద్దిపేట, ఆగస్టు 6(లోకల్ గైడ్):
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుకునూర్‌పల్లి పోలీసులు అంతర్‌రాష్ట్ర వాహన దొంగను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన రెండు కార్లు, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన పెండ్యాల సుదర్శన్ (32)గా పోలీసులు గుర్తించారు.పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు ఒంటరిగా ఉన్న క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని దూర ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి వాహనాలను అద్దెకు తీసుకునేవాడు. ప్రయాణంలో భోజనం లేదా విశ్రాంతి పేరుతో నిర్మానుష్య ప్రాంతాల్లో వాహనాన్ని ఆపించి, డ్రైవర్ కారు దిగిన వెంటనే కారుతో పరారయ్యేవాడు. అనంతరం దొంగిలించిన వాహనాలను ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు విక్రయించేవాడని విచారణలో వెల్లడైంది.వికారాబాద్ జిల్లాకు చెందిన ఓలా క్యాబ్ డ్రైవర్ అంగోత్ తుల్జా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుకునూర్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ నర్సింలు పర్యవేక్షణలో ఎస్ఐ బాలకృష్ణ నేతృత్వంలో సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి వద్ద నుంచి కుకునూర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించిన స్విఫ్ట్ డిజైర్ కారు (TS 34 TB 7506), ఖమ్మంలో దొంగిలించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ బైక్ (TS 04 FJ 6045), ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా సోమందేపల్లి పరిధిలో దొంగిలించిన టోయోటా ఎటియోస్ కారు (AP 31 TP 2556) లను స్వాధీనం చేసుకున్నారు.విచారణలో నిందితుడు గతంలో గజ్వేల్, నర్సింగి, ఎస్సార్‌నగర్, చైతన్యపురి, ఖమ్మం, భద్రాచలం, మధురానగర్, మలకపేట, నకిరేకల్ తదితర పోలీస్ స్టేషన్‌ల పరిధిలో పలు వాహన దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.నిందితుడిని అరెస్ట్ చేసి వాహనాలను స్వాధీనం చేసుకోవడంలో విశేష కృషి చేసిన సీఐ లతీఫ్, ఎస్ఐ బాలకృష్ణ, కానిస్టేబుళ్లు రమేష్, రాజు, శివ, రాజేష్, రత్నాకర్, చంద్రం, ఐటీ కోర్ కానిస్టేబుల్ శ్రీకాంత్‌తో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ అభినందించారు.
