- District News
- Khammam
- బీఆర్ఎస్ నేతలపై పోలీసుల దాడులు ఖండనీయం
బీఆర్ఎస్ నేతలపై పోలీసుల దాడులు ఖండనీయం
జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ తీవ్ర ఆగ్రహం
కారేపల్లి (సింగరేణి ), సెప్టెంబర్ 7, లోకల్ గైడ్ న్యూస్ : బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ తీవ్రంగా ఖండించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై పోలీసులతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆరోపించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు నాయకత్వంలో అసెంబ్లీకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులపై పోలీసులు వ్యవహరించిన తీరును గౌసుద్దీన్ తీవ్రంగా తప్పుబట్టారు.
కేటీఆర్, హరీష్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తదితర నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. అలాగే మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి తదితరుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా ఆయన తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చడంలో విఫలమైందని గౌసుద్దీన్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా ఆయా వర్గాల ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల తరఫున గొంతెత్తుతున్న బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడం, వారిపై పోలీసులతో దాడులు చేయించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేసినంత మాత్రాన ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను ఆపలేరని స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకులపై ఇలాంటి చర్యలు పునరావృతమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని గౌసుద్దీన్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులపై జరిగిన ఘటనలకు బాధ్యులైన వారు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
