ఆదివాసీ హక్కులపై దాడి.. సహించేది లేదు!

ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో గర్జించిన ఆదివాసీ సంఘాలు

Published On
ఆదివాసీ హక్కులపై దాడి.. సహించేది లేదు!

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగస్టు 9 : ఆదివాసీల హక్కులను హరించే విధానాలను తక్షణమే నిలిపివేయాలని, తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను పరిరక్షించుకునేందుకు ఆదివాసీ ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని ఆదివాసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. “ప్రపంచ ఆదివాసులారా.. ఐక్యం కండి” అనే నినాదంతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఏహెచ్‌పీఎస్ ఆదివాసీ పోరాట హక్కుల సమితి, ఏఐటీఎఫ్ (ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం)తో పాటు పలు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘం జెండాను ఎగురవేసి, ఆదివాసీ హక్కుల కోసం పోరాడి అమరులైన వీరులకు జోహార్.. జోహార్ అంటూ ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు ఆలెం గురవయ్య, ధనసరి శ్రీను, యదలపల్లి శీను, ఆలెం బాలరాజు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులు, స్వయం పాలన కోసం అనేక తరాలుగా సాగిన పోరాటాలను గుర్తుచేశారు. “జల్.. జంగల్.. జమీన్” నినాదంతో ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన కొమరం భీమ్, బిర్సా ముండా, సమ్మక్క-సారలమ్మ, అల్లూరి సీతారామరాజు, గంటం దొర, మల్లు దొర తదితరుల త్యాగాలను స్మరించారు.
అటవీ హక్కుల చట్టం–2006, పీసా చట్టం, రాజ్యాంగంలోని ఐదో, ఆరో షెడ్యూళ్లు వంటి ఆదివాసీ రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన ప్రభుత్వాలు వాటిని నిర్వీర్యం చేసే విధానాలను అవలంబిస్తున్నాయని నాయకులు ఆరోపించారు. నూతన ఆర్థిక విధానాలు, అటవీ విధానాల పేరుతో ఆదివాసీలను వారి భూములు, అడవుల నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
అడవుల్లోని సహజ వనరులు, ఖనిజ సంపదపై కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను ఆదివాసీ ప్రజలు ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలు పోరాడి సాధించుకున్న చట్టాలను అమలు చేయించుకునే వరకు ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని అన్నారు. హక్కుల పరిరక్షణ కోసం ఆదివాసీ యువత, మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు ఆలెం గురువయ్య, వెంకన్న, కోటయ్య, నాగేశ్వరరావు, సంపత్, సుగుణ, మంగమ్మ, స్వరూప, సావిత్రి, కోటమ్మ, నిరోష తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...