- District News
- డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నివారణకు డ్రైడే పకడ్బందీగా నిర్వహించాలి.
డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నివారణకు డ్రైడే పకడ్బందీగా నిర్వహించాలి.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నాణ్యతతో, నిర్ణీత ప్రమాణాల మేరకు చేపట్టాలి.
వనపర్తి ప్రతినిధి సెప్టెంబర్ 24:(లోకల్ గైడ్ న్యూస్)
వనపర్తి పట్టణంలోని రాంనగర్ కాలనీలో శుక్రవారం డ్రైడే కార్యక్రమం అమలును క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కాలనీల్లో పరిసరాల పరిశుభ్రత, నీటి నిల్వలు, దోమల వ్యాప్తికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించి, డెంగ్యూ నివారణకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల పట్టణంలో డెంగ్యూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దోమలు వృద్ధి చెందకుండా ఇళ్ల పరిసరాల్లో, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ప్రజలు తమ ఇళ్లలోని పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ పాత్రలు, ఇతర వస్తువుల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతంలో ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడే కార్యక్రమాన్ని కేవలం నామమాత్రంగా కాకుండా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఆరోగ్య, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, దోమల నివారణ చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా, ప్రజల భాగస్వామ్యంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
---- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన ..
వనపర్తి పట్టణంలోని నాలుగో వార్డులో నిర్మాణంలో ఉన్న కురుమమ్మ, ఎల్లమ్మ అనే లబ్ధిదారులకు చెందిన ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయో పరిశీలించి, నిర్మాణంలో పాటిస్తున్న పద్ధతులు, పనుల నాణ్యత, లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అందుతున్న బిల్లుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు లబ్ధిదారులకు సకాలంలో అందుతున్నాయా లేదా అనే విషయంపై ఆరా తీశారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని, నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనులను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని, అందుబాటులో ఉన్న నిధులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని లబ్ధిదారుల కు ఆయన సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం కోసం అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు తీసుకోకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన ఆర్థిక సహాయం కోసం స్వయం సహాయక సంఘాల ( ఎస్ హేచ్ జీ) ద్వారా రుణాలు పొందేలా లబ్ధిదారులకు సహకరించాలని సూచించారు.ఇళ్ల నిర్మాణం మధ్యలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా లబ్ధిదారులు అప్పుల భారంలో కూరుకుపోకుండా, వారికి అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు పొందేందుకు అవసరమైన ప్రక్రియను సంబంధిత అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా పునాదులు (బేస్‌మెంట్లు) అవసరానికి మించి ఎక్కువ ఎత్తులో నిర్మించకుండా లబ్ధిదారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, నిర్దేశిత నిర్మాణ ప్రమాణాలకు అనుగుణంగానే ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చూడాలని తెలిపారు.
--- కలెక్టర్ ను సన్మానించిన జర్నలిస్ట్ లక్ష్మణ్..
రాంనగర్ కాలనీలో డ్రైడే పనులను పరిశీలించడానికి వచ్చిన కలెక్టర్ ను సీనియర్ జర్నలిస్ట్ శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం కాలనీలో ఉన్న పారిశుధ్య సమస్య లను కలెక్టర్ దృష్టికి తీసుకపోయారు. ప్రధానంగా డ్రైనేజీలో చెత్త చెదారం తో నిండిపోయి మురుగువాసన వస్తుందని కలెక్టర్ కు చెప్పారు. మురుగు వాసన వలన కాలనీలే దోమలు ప్రబలి చిన్నారు రోగాల బారిన పడుతున్నారని ఆయన కలెక్టర్ కు చెప్పారు. అక్కడే ఉన్న మున్సిపల
కమీషనర్ ను పిలిచి ఇక్కడ వెంటనే పారిశుధ్య చర్యలు తీసుకోవాలని, రోగాల బారిన వారితో పాటు మిగతా వారికి డెంగ్యూ ,ఇతర వ్యాధులకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విఠోభా, స్థానిక కౌన్సిలర్లు పరశురాం, శరవంద, స్థానికులు సూగురు రాములు,విలేకరి లక్ష్మణ్ సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
