- District News
- Khammam
- పట్టభద్రుల గొంతుకగా గడల శ్రీనివాస్!
పట్టభద్రుల గొంతుకగా గడల శ్రీనివాస్!
సింగరేణి జనసేన శ్రేణుల భారీ హాజరు.. విద్యార్థులు, పట్టభద్రుల సమస్యలపై ప్రత్యేక దృష్టి
ఖమ్మం నగరంలోని ఎంబీ గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన జనసేన తెలంగాణ శంఖారావం సభకు సింగరేణి మండల జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్టభద్రులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ గడల శ్రీనివాస్ ముందుకు సాగుతున్నారని జనసేన నాయకులు తెలిపారు. ఉన్నత విద్య పూర్తిచేసుకున్న పట్టభద్రులకు ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నియామకాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత భవిష్యత్తుకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణకు కృషి చేయాలనే లక్ష్యంతో గడల శ్రీనివాస్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారని నాయకులు వివరించారు. వైద్యరంగంలో తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవాన్ని ప్రజా సేవలోనూ కొనసాగిస్తూ విద్యార్థులు, పట్టభద్రుల సమస్యలను శాసనమండలి వేదికగా బలంగా వినిపించాలనే సంకల్పంతో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా గడల శ్రీనివాస్ జనసేన కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ పట్టభద్రులు, విద్యార్థులు, యువతతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణలో జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి సాగర్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధా రామ్, రాజలింగం, హీరో తనీష్ అల్లాడి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి మండలానికి చెందిన పురం అంజయ్య, భరోత్ కళ్యాణ్, బడుగు శ్రీనివాస్ యాదవ్, మొగిలిచర్ల రాంబాబు, రామరాజు, రవి తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు సభకు హాజరై గడల శ్రీనివాస్‌కు మద్దతు తెలిపారు. పట్టభద్రులు, విద్యార్థుల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ జనసేనను ప్రజలకు మరింత చేరువ చేయాలని నాయకులు పేర్కొన్నారు.
