అటవీ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం :

జిల్లా కలెక్టర్ అంకిత్

Published On
అటవీ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం :

 

కొత్తగూడెం : లోకల్ గైడ్ న్యూస్ : 
విధి నిర్వహణలో అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సేవలు, త్యాగాలు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కొత్తగూడెం ఇల్లందు క్రాస్‌రోడ్స్‌లోని చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ అమరవీరుల సంస్మరణ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు చలమల శ్రీనివాసరావు విగ్రహానికి కలెక్టర్ అంకిత్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అటవీ సంపదను కాపాడే క్రమంలో ఎంతోమంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారి సేవలను భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది అటవీ సంపద సంరక్షణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. సిబ్బందికి అవసరమైన శిక్షణ, భద్రతా పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సౌకర్యాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా అటవీ నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతులు, ఆధునిక పరికరాలు, లైటింగ్, కమ్యూనికేషన్ సౌకర్యాలతో పాటు సిబ్బందికి నిరంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ శాఖ సిబ్బంది కుటుంబ సభ్యుల త్యాగాలను కూడా సమాజం గుర్తుంచుకోవాలని కలెక్టర్ అన్నారు. అమరవీరుల స్ఫూర్తితో అటవీ సంపదను పరిరక్షించేందుకు అధికారులు, సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విస్తారమైన అటవీ ప్రాంతాన్ని కలిగి ఉందని, ఇక్కడి కోయలు, కొండరెడ్లు తదితర గిరిజన సమాజాలకు అడవులతో ఎంతోకాలంగా సన్నిహిత సంబంధం ఉందని తెలిపారు. అటవీ సంపద పరిరక్షణతో పాటు గిరిజనుల హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. అటవీ శాఖ, గిరిజన సమాజాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ, అటవీ హక్కులపై అధికారులు, అటవీ సిబ్బంది, గిరిజన సమాజాల భాగస్వామ్యంతో అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అడవులను, పర్యావరణాన్ని కాపాడటంతో పాటు అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల హక్కులను పరిరక్షిస్తూ సమతుల్యతతో ముందుకు సాగాలని అన్నారు. అటవీ అమరవీరుల త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో అటవీ సంపదను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం, సమాజం అండగా నిలవాలని, వారి త్యాగాలకు తగిన గౌరవం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా అటవీ అధికారి సిధార్డ్ విక్రమ్ సింగ్, అటవీ శాఖ అధికారులు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఇతర అటవీ శాఖ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News