- District News
- Khammam
- రైతు బాటకు జేసీబీ బాటలు.. సర్పంచ్ మాతృ నాయక్ చొరవ
రైతు బాటకు జేసీబీ బాటలు.. సర్పంచ్ మాతృ నాయక్ చొరవ
పొలాలకు వెళ్లే డొంకదారిని అభివృద్ధి చేసిన గ్రామపంచాయతీ.. రైతుల్లో హర్షం
: దుబ్బ తండా గ్రామంలో రైతుల పొలాలకు వెళ్లే రహదారి సమస్యకు గ్రామ సర్పంచ్ అంగోత్ మాతృ నాయక్ చొరవతో పరిష్కారం లభించింది. గ్రామంలోని ముందు బజార్ ప్రాంతం నుంచి చేను పొలాలకు వెళ్లే డొంకదారి సరిగా లేకపోవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన సర్పంచ్ మాతృ నాయక్ వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో రహదారి అభివృద్ధి పనులు చేపట్టారు. రైతులు తమ పొలాలకు సులభంగా చేరుకునేలా దారిని చదును చేయడంతో పాటు రాకపోకలకు అనుకూలంగా రహదారిని తీర్చిదిద్దారు. ముఖ్యంగా వర్షాకాలంలో బురద, గుంతల కారణంగా రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా రహదారి పనులు చేపట్టడం పట్ల గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా.. అభివృద్ధి పనుల్లో ముందడుగు
గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు రైతుల సమస్యల పరిష్కారానికి సర్పంచ్ మాతృ నాయక్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను తెలియజేసిన వెంటనే స్పందించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రైతుల పొలాలకు వెళ్లే దారిని అభివృద్ధి చేయడం ద్వారా వ్యవసాయ పనులకు, పంటల రవాణాకు మరింత సౌకర్యం కలుగుతుందని అన్నారు. గ్రామాభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుని సర్పంచ్ మాతృ నాయక్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని, ఇదే విధంగా గ్రామంలోని ఇతర సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు సభ్యులు గుగులోతు హరి, బానోతు శ్రీరాములు, గుగులోతు చిన్న, ధరావత్ నందు తదితరులు పాల్గొన్నారు.
