- District News
- ఎస్‌ఐఆర్‌పై నిర్వహించే గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి
ఎస్‌ఐఆర్‌పై నిర్వహించే గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రతి ఓటరు అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలి.
కామారెడ్డి జిల్లా,
కామారెడ్డి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోని గ్రామాల్లో గురువారం, 27.08.2026న గ్రామ సభలు
నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయడమే లక్ష్యంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను బహిరంగంగా చదివి వినిపించడంతో పాటు, జాబితాలోని వివరాలను ప్రజలకు తెలియజేస్తారని తెలిపారు.
మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, నివాసం మారిన ఓటర్ల వివరాలు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓటర్ల వివరాలు, గైర్హాజరైన ఓటర్ల జాబితాలను కూడా గ్రామ సభల్లో చదివి వినిపిస్తారని తెలిపారు.
ప్రతి ఓటరు, గ్రామ ప్రజలు తప్పనిసరిగా గ్రామ సభలకు హాజరై ఓటరు జాబితాను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. తమ పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్నా, పేరు తొలగింపుపై అభ్యంతరాలు ఉన్నా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
గ్రామ సభల్లో బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షకులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది తదితర అధికారులు పాల్గొని నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ, అభ్యంతరాల నమోదు, పరిష్కార విధానం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని కలెక్టర్ తెలిపారు.
జుక్కల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నిర్వహించే గ్రామ సభలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటరు జాబితా సక్రమంగా ఉండటం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హులు మరియు పునరావృత నమోదులను గుర్తించేలా ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు భాగస్వామ్యం కీలకమని, అందువల్ల 27.08.2026న నిర్వహించే గ్రామ సభలకు ప్రజలు తప్పనిసరిగా హాజరై ఓటరు జాబితాను పరిశీలించి తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ విజ్ఞప్తి చేశారు.
