- District News
- Khammam
- మాదారంలో తీజ్ సంబరాల జోష్!
మాదారంలో తీజ్ సంబరాల జోష్!
సర్పంచ్ అజ్మీరా ఉమా నరేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 4వ రోజు వేడుకలు
ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్, ఆగష్టు 11: గిరిజనుల సంప్రదాయ సంస్కృతి, ఆచారాలకు ప్రతీకగా నిలిచే తీజ్ పండుగ 4వ రోజు వేడుకలు కారేపల్లి మండలం మాదారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ అజ్మీరా ఉమా నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు గిరిజన ఆడపడుచులు, చిన్నారులు, పెద్దలు, గ్రామ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.
తీజ్ పండుగలో భాగంగా నాటిన గోధుమ గింజలు, శనగలు మూడో రోజుకే 100 శాతం మొలకెత్తడంతో గ్రామంలోని గిరిజన కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పంటలు, పచ్చదనం, కుటుంబ సౌభాగ్యం, గ్రామ అభివృద్ధి కోసం తీజ్ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం గిరిజన సంస్కృతిలో ప్రత్యేకతగా నిలుస్తోంది.

మాదారం గ్రామంలోని అజ్మీరా మంగీత ఇంటి వద్ద జరిగిన వేడుకల్లో డీజే సౌండ్స్, సంప్రదాయ పాటలతో పండుగ వాతావరణం మరింత సందడిగా మారింది. గిరిజన ఆడపడుచులు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ తీజ్ సంబరాలను అంబరాన్ని అంటించారు.
ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న గిరిజన బిడ్డలకు సంప్రదాయబద్ధంగా చీరలను అందజేశారు. అజ్మీరా శారద (భర్త సురేష్), అజ్మీరా ప్రభావతి (భర్త గణేష్), అజ్మీరా శారద (భర్త రాందాస్), మాలోత్ రాంబాబు చీరలను అందజేసి గిరిజన బిడ్డలను ప్రోత్సహించారు.
తీజ్ పండుగను ఘనంగా నిర్వహిస్తూ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు సర్పంచ్ అజ్మీరా ఉమా నరేష్ చేస్తున్న కృషిని గ్రామస్తులు అభినందించారు. పండుగ ద్వారా గిరిజన యువతలో తమ సంస్కృతి, సంప్రదాయాలపై మరింత అవగాహన పెంపొందుతుందని వారు పేర్కొన్నారు.
