- District News
- భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన.
భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన.
నగరేశ్వర దేవాలయంలో శ్రావణ మాస ప్రత్యేక పూజలు - ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
లోకల్ గైడ్/ తాండూర్:
పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకొని... తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు గుబ్బ ప్రగతి ఆధ్వర్యంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా అమ్మవారిని నూతన చీరలు, బ్లౌజ్ పీసులు, వివిధ రకాల పూజా సామగ్రితో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి సామూహికంగా కుంకుమార్చన, హారతులు సమర్పించారు. ఈ క్రమంలో మహిళల భక్తి కీర్తనలు, పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న పరిమల్ మాట్లాడుతూ... ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించిన మహిళా సంఘం ప్రతినిధులు, మహిళా సోదరీమణులు, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ వాసవి మాత ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. దేశానికి అన్నం పెట్టే రైతును గౌరవించాలనే ఉద్దేశంతో రైతుల వద్దకు వెళ్లి కాయగూరలు కొనుగోలు చేసి అమ్మవారికి సమర్పించినట్లు తెలిపారు. రైతు బాగుంటేనే సమాజం బాగుపడుతుందని అన్నారు. రైతుల శ్రమను గౌరవించడంతో పాటు వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.అనంతరం
మహిళా సంఘం అధ్యక్షురాలు గుబ్బ ప్రగతి మాట్లాడుతూ... అమ్మవారి అనుగ్రహంతో కార్యక్రమంలో లక్కీ డ్రా నిర్వహించి ఎనిమిది మంది ముత్తయిదులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన వారికి చీరలు, బ్లౌజ్ పీసులతో పాటు హారతి సామగ్రిని అందజేసి సత్కరించనున్నట్లు చెప్పారు. శ్రావణ మాసంలో మహిళలంతా ఒకచోట చేరి అమ్మవారిని సామూహికంగా పూజించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులోనూ మహిళా సంఘం ఆధ్వర్యంలో మరిన్ని ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరేశ్వర పాలకమండలి సభ్యులు, మహిళా సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
