- District News
- Khammam
- రైతు కూలీల ఐక్య పోరాటానికి ఖమ్మం పిలుపు
రైతు కూలీల ఐక్య పోరాటానికి ఖమ్మం పిలుపు
28న భారీ బహిరంగ సభ.. 29, 30న జాతీయ మహాసభలు
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 10, లోకల్ గైడ్ న్యూస్ :
ఖమ్మం నగరంలో ఈ నెల 28న నిర్వహించనున్న భారీ బహిరంగ సభ, 29, 30 తేదీల్లో జరగనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలకు సంబంధించిన గోడ పోస్టర్లను కారేపల్లి మండలం మాదారం గ్రామంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి వై. ప్రకాష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలతో దేశంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందన్నారు. ఎన్నికలకు ముందు 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వాలు అమలు చేయలేదని విమర్శించారు. రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, నాలుగు కార్మిక చట్ట సవరణలు, విద్యుత్ బిల్లును రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు ఉద్యమించారని తెలిపారు. ఆ ఉద్యమంలో 750 మంది రైతులు అమరులయ్యారని పేర్కొన్నారు. రైతుల ఉద్యమం నేపథ్యంలో పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయడం, కనీస వేతన చట్టం అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినా ఇప్పటివరకు వాటిని అమలు చేయకుండా రైతాంగానికి ద్రోహం చేసిందని ఆరోపించారు. రైతు, కూలీ, కార్మిక వర్గాలను ఐక్యం చేసి భవిష్యత్ పోరాటాలను మరింత ఉధృతం చేసేలా జాతీయ మహాసభల్లో కార్యాచరణ రూపొందించనున్నట్లు వై. ప్రకాష్ తెలిపారు. ఈ నెల 28న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు, 29, 30 తేదీల్లో జరిగే జాతీయ మహాసభలకు రైతులు, కూలీలు, కార్మికులు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా, మండల నాయకులు కోయిల శ్రీనివాస్, కావేటి నాగేశ్వరరావు, గడ్డం వెంకన్న, నరేష్, నరసింహారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
