- District News
- Khammam
- కాంగ్రెస్ వైఫల్యాలపై ఇక సమరమే!
కాంగ్రెస్ వైఫల్యాలపై ఇక సమరమే!
సెప్టెంబర్ 2 నుంచి సమరభేరి.. ప్రజల గొంతుకై ఉద్యమిస్తాం: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
ఇల్లందు : లోకల్ గైడ్ న్యూస్ , ఆగస్టు 31 :
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనపై ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి నిర్వహించనున్న ‘సమరభేరి’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ బానోత్ హరిప్రియ నాయక్ పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపు మేరకు ఇల్లందు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఇల్లందు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో హరిప్రియ నాయక్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పోలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్ శ్రేణులపై ఉందన్నారు. సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమయ్యే సమరభేరి కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. పట్టణ, మండల, గ్రామస్థాయిలో కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని హరిప్రియ నాయక్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు అంతోటి అచ్చయ్య, సామ మోహన్‌రెడ్డి, మల్లెంపటి శ్రీనివాసరావు, కాట్రాల రాంబాబు, బోడేపూడి బుచ్చిబాబు, బీఆర్‌ఎస్ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఉపసర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
