ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి..... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

రైతులు ధాన్యాన్ని శుభ్రపరిచి, నిర్దేశిత తేమ శాతంతోనే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి.ప్రతి కొనుగోలు కేంద్రంలో పంచాయతీ సిబ్బందిని నియమించాలి. కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలకు పూర్తి స్థాయిలో శిక్షణ అందించా

గోదాముల స్థలాలను ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలి* వానాకాలం ధాన్యం కొనుగోళ్ల సన్నాహకాలపై అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్
Published On
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి..... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

ఖమ్మం, సెప్టెంబర్-10: లోకల్ గైడ్ బ్యూరో:

వానాకాలం సీజన్‌ 2026-27లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. 

గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులు, ధాన్యం రవాణా కాంట్రాక్టర్లు, గోదాముల నిర్వాహకులతో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల సన్నాహకాలపై అదనపు కలెక్టర్ సమీక్షించారు.

అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి  మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఈ సీజన్‌లో సుమారు 2.79 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు, గోదాములు, రవాణా తదితర అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. అక్టోబర్‌ 1, 2026 నుంచి జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రైతులకు ముందస్తుగా అవగాహన కల్పించాలి:
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ముందు తప్పనిసరిగా శుభ్రపరచుకునేలా రైతు వేదికలు, వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ధాన్యంలో నిర్దేశిత తేమ శాతం వచ్చిన తర్వాతే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని రైతులకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది, శిక్షణ:
ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో పంచాయతీ నుంచి ఒక సిబ్బందిని నియమించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రతి కేంద్రం ఇన్‌చార్జికి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, నాణ్యతా ప్రమాణాలు, రికార్డుల నిర్వహణ, తదితర అంశాలపై పూర్తి స్థాయి అవగాహన ఉండేలా అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి మూడు మండలాలకు ఒక శిక్షణా సమావేశం చొప్పున నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు.

కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేసి భద్రపరచాలని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. 

కొనుగోలు కేంద్రాల వివరాలను చిత్రాలతో నమోదు చేయాలి:
కొత్తగా ప్రవేశపెట్టిన కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణ దరఖాస్తులో ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అందుబాటులో ఉన్న మౌళిక సదుపాయాల వివరాలను చిత్రాలతో సహా అక్టోబర్‌ 10లోపు నమోదు చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రమాణాలతో సిద్ధంగా ఉండాలని, నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు లేని కేంద్రాలకు కమీషన్‌ చెల్లింపులు ఉండవని స్పష్టం చేశారు.

ఏడు సన్న రకాల ధాన్యానికి రూ.500 బోనస్:
ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం ఎ-గ్రేడ్‌ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461, సాధారణ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,441 చెల్లించనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాలైన బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్‌-15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్ సెగ్మెంట్, కేఎన్‌ఎం-1638, డబ్ల్యూజీఎల్‌-44, కేఎన్‌ఎం-7715 రకాల ఎ-గ్రేడ్‌ ధాన్యానికి మాత్రమే క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లించనున్నట్లు తెలిపారు.

ఏడు సన్న రకాల ధాన్యాన్ని వ్యవసాయ శాఖ అధికారులు ధృవీకరించాలని, ప్రతి రకానికి సంబంధించిన నమూనాలను సిద్ధం చేయాలని సూచించారు. మొత్తం 300 నమూనాలను సిద్ధం చేసి, ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏడు రకాల ధాన్యం నమూనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

గోదాముల స్థలాలను ముందుగానే సిద్ధం చేయాలి:
కొనుగోలు చేసిన ధాన్యాన్ని అధికారికంగా గుర్తించిన గోదాములకు మాత్రమే తరలించాలని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలో అవసరమైన గోదాముల స్థలాలను ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణా చేసే ప్రతి వాహనానికి జీపీఎస్‌ ఆధారిత పర్యవేక్షణ పరికరాలను ఏర్పాటు చేయాలని ధాన్యం రవాణా కాంట్రాక్టర్లకు సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, కొనుగోలు నుంచి గోదాములకు తరలింపు వరకు ప్రతి దశను అధికారులు సమర్థవంతంగా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ సూచించారు. 

ఈ సమావేశంలో సహాయ పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా సహకార అధికారి గంగాధర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, జిల్లా పౌర సరఫరాల సంస్థ అధికారులు, మెప్మా, మార్క్‌ఫెడ్‌, తూనికలు కొలతల శాఖ, రవాణా శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

శంకర్‌పల్లి మున్సిపాలిటీలో రూ.1.55 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన శంకర్‌పల్లి మున్సిపాలిటీలో రూ.1.55 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన
        శంకర్‌పల్లి, ( లోకల్ గైడ్ ): మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే
నేటి తరానికి వీరనారి చాకలి ఐలమ్మ ఆదర్శం. 
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి..... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
ప్రతిభ చాటిన వాకర్స్  సభ్యులకు ఘన సన్మానం
బహుజనుల హక్కుల కోసం పోరాడిన ధీరవనిత ఐలమ్మ. - ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి.
మండలంలో 17 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక. విద్యార్థుల అభ్యున్నతి, పాఠశాలల అభివృద్ధిలో కృషికి గుర్తింపు
పేట జిల్లాను బాల కార్మికు లు,బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి