- District News
- Khammam
- పేరుపల్లికి అభివృద్ధి బాటలు.. ఎంపీ నిధులతో సీసీ రోడ్డు
పేరుపల్లికి అభివృద్ధి బాటలు.. ఎంపీ నిధులతో సీసీ రోడ్డు
మల్లెల నాగేశ్వర్‌రావు ప్రత్యేక చొరవతో రూ.4.50 లక్షల నిధుల మంజూరు
ఖమ్మం జిల్లా, కారేపల్లి : ఆగస్టు 16 (లోకల్ గైడ్ ) :
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. పేరుపల్లి గ్రామంలో ప్రజల చిరకాల అవసరంగా ఉన్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రాంసహాయం రఘురామ్‌రెడ్డి ఎంపీ నిధుల నుంచి రూ.4.50 లక్షలు మంజూరు చేయడంతో ఆదివారం రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లెల నాగేశ్వర్‌రావు ప్రత్యేక చొరవతో ఈ సీసీ రోడ్డు మంజూరైందని గ్రామస్థులు తెలిపారు. తెల్లగొర్ల పిచ్చయ్య ఇంటి నుంచి చింతిరాల సుశీలమ్మ ఇంటి వరకు నిర్మించనున్న సీసీ రోడ్డుకు గ్రామ సర్పంచ్ బాణోత్ పద్మావతి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడమే కాంగ్రెస్ నాయకత్వం లక్ష్యమన్నారు. ప్రజల అవసరాన్ని గుర్తించి సీసీ రోడ్డు కోసం ప్రత్యేకంగా కృషి చేసిన మల్లెల నాగేశ్వర్‌రావు, ఎంపీ నిధుల నుంచి రూ.4.50 లక్షలు మంజూరు చేసిన ఖమ్మం ఎంపీ రాంసహాయం రఘురామ్‌రెడ్డిలకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
రోడ్డు నిర్మాణంతో వర్షాకాలంలో బురద, రాకపోకల ఇబ్బందులు తొలగి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేసి మౌలిక వసతులను మెరుగుపరచాలని వారు కోరారు.
కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ డైరెక్టర్ మధ్యానపు శ్రీనివాసరావు, వార్డు మెంబర్ బాణోత్ వీరభద్రు, పులకాని సత్తిరెడ్డి, మేడ వెంకన్న, మాజీ గుడి చైర్మన్ పుట్టా నాగేశ్వరరావు, బుడిగ సత్యనారాయణ, తెల్లగొర్ల పిచ్చయ్య, బండారు రామకోటి, బండారు శ్రీనివాసరావు, కాలపాక వెంకటేశ్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బండారు మురళి, తెల్లగొర్ల భద్రి తదితరులు పాల్గొన్నారు.
