- District News
- Khammam
- భాగ్యనగర్ తండాలో చేయూత పింఛన్‌పై సర్పంచ్ ఫోకస్
భాగ్యనగర్ తండాలో చేయూత పింఛన్‌పై సర్పంచ్ ఫోకస్
దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన.. పర్యవేక్షించిన సర్పంచ్ బానోత్ హీరాలాల్
భాగ్యనగర్ తండా, సెప్టెంబర్ 22 (లోకల్ గైడ్ న్యూస్) : చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందేలా భాగ్యనగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఈ ప్రక్రియను సర్పంచ్ బానోత్ హీరాలాల్ పర్యవేక్షించారు. ప్రత్యేక అధికారి, మండల నీటిపారుదల శాఖ సహాయ కార్యనిర్వహణ ఇంజనీర్ ఎడిండ్ల నాగయ్య దరఖాస్తుదారుల వద్దకే వెళ్లి వారి అర్హతలు, సంబంధిత పత్రాలను పరిశీలించారు. గత నెలలో స్వీకరించిన చేయూత పింఛన్ దరఖాస్తులపై ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగుతోంది. ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ హీరాలాల్ మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. దరఖాస్తుదారులు అధికారులు కోరే అర్హత పత్రాలను అందించి పరిశీలన ప్రక్రియకు పూర్తి సహకారం అందించాలని కోరారు. అర్హత నిర్ధారణలో అవసరమైన వివరాలను స్పష్టంగా అందించాలని సూచించారు. గ్రామంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సజావుగా సాగేందుకు పంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకం ప్రయోజనం అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పెండ్రా అనిల్ కుమార్, వార్డు సభ్యులు వాంకుడోత్ గాంధీ, పంచాయతీ సిబ్బంది హేంచంద్, రాందాస్, ఇరిగేషన్ సిబ్బంది వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు గుగులోత్ మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.
