- District News
- Khammam
- స్వచ్ఛతే లక్ష్యం.. సూర్యతండా ప్రభుత్వ పాఠశాల ముందడుగు
స్వచ్ఛతే లక్ష్యం.. సూర్యతండా ప్రభుత్వ పాఠశాల ముందడుగు
చెత్త వేర్పాటుపై విద్యార్థులు, గ్రామస్తులకు అవగాహన.. పరిశుభ్రతపై సామూహిక చైతన్యానికి పిలుపు
స్వచ్ఛతను కేవలం కార్యక్రమంగా కాకుండా నిత్యజీవితంలో భాగంగా మార్చే దిశగా సూర్యతండా ప్రభుత్వ పాఠశాల ముందడుగు వేసింది. ‘స్వచ్ఛతా హి సేవ–2026’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ ప్రతినిధులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో పలు స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛత, పరిశుభ్రత ప్రాధాన్యతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం పాఠశాల పరిసరాలను శుభ్రం చేస్తూ పరిశుభ్రమైన వాతావరణం ఆవశ్యకతను చాటిచెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పాఠశాల, గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అవగాహన కల్పించారు. గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తడి చెత్త, పొడి చెత్త, హానికర వ్యర్థాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు నాలుగు రకాలుగా వేరు చేసి సేకరించే విధానంపై అవగాహన కల్పించారు. ఇంటి వద్దే చెత్తను వేరు చేసి, నిర్దేశిత విధానంలో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం, కాల్చడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని, గ్రామ పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాందాస్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హార్జ్య, ఉపాధ్యాయులు వీరన్న, కమలాబాయి, విద్యార్థులు, గ్రామపంచాయతీ కార్యదర్శి భార్గవి తేజ, గ్రామస్తులు కాంతారావు, సాయి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛత కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు.
