- District News
- Khammam
- ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు: డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్
ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు: డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్
విశిష్ట తత్వవేత్త, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సత్తుపల్లి పట్టణంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సత్తుపల్లి పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి (MEO) కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం సత్తుపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పాత సెంటర్‌లోని ZPHS పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబోధనతో పాటు సమాజానికి విలువలు, క్రమశిక్షణ, నైతికతను అందిస్తూ భావి తరాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రెహనా కమల్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, వార్డు కౌన్సిలర్లు, మండల విద్యాశాఖ అధికారి, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
