- District News
- వెల్కటూరులో ‘మన పోలీస్ - మన ఊరు’ కార్యక్రమం
వెల్కటూరులో ‘మన పోలీస్ - మన ఊరు’ కార్యక్రమం
గ్రామంలో 24 సీసీటీవీ కెమెరాలు ప్రారంభించిన సీపీ రష్మీ పెరుమాళ్
.jpeg)
ప్రజలకు, పోలీసులకు మధ్య దూరాన్ని తగ్గించి కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన ‘మన పోలీస్ - మన ఊరు’ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ శుక్రవారం సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్కటూరు గ్రామాన్ని సందర్శించారు. సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన 24 సీసీటీవీ కెమెరాలను సీపీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో పోలీస్ వర్సెస్ విలేజ్ యూత్ మధ్య ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను టాస్ వేసి ప్రారంభించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడల వైపు మళ్లాలని సూచించారు. ఎంపీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి 100 మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని సీపీ స్వయంగా మొక్క నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీపీఎస్ పాఠశాలలో వర్షపు నీటి నిల్వ ఏర్పాటును ప్రారంభించారు. ఆదిత్య ఐ హాస్పిటల్, ఎల్‌వీ ప్రసాద్ ఐ హాస్పిటల్, అగర్వాల్ ఐ హాస్పిటల్‌ల సంయుక్త సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సీపీ ప్రారంభించారు. అనంతరం సురభి మెడికల్ కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై నృత్య ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. వెల్కటూరు విద్యార్థులు, యువత యోగా, ధ్యానం ప్రాముఖ్యతను తెలియజేస్తూ యోగాసన ప్రదర్శన చేశారు. ఆకస్మిక గుండెపోటు సమయంలో ప్రాణాలు కాపాడేందుకు చేపట్టాల్సిన సీపీఆర్ విధానాన్ని సురభి మెడికల్ కళాశాల వైద్యులు ప్రత్యక్షంగా ప్రదర్శించారు. సైకియాట్రిస్ట్ డాక్టర్ హరీష్ డ్రగ్స్ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని, డీ-అడిక్షన్ చికిత్స ద్వారా వ్యసనం నుంచి బయటపడవచ్చని వివరించారు. డీఆర్‌యూజీఎస్‌లో డీ అంటే డేంజరస్, ఆర్ అంటే రిస్కీ అండ్ రూత్‌లెస్, యూ అంటే అన్‌హెల్తీ అండ్ అన్‌కంట్రోల్డ్, జీ అంటే గోల్ కిల్లింగ్, ఎస్ అంటే సోషల్ లైఫ్ కిల్లింగ్ అని వివరించారు. అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ మాట్లాడుతూ సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 250కి పైగా గ్రామాల్లో 1,400కు పైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సీసీటీవీలతో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు. ‘సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర’ ద్వారా 700 మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. అత్యవసర సమయంలో డయల్ 112కు కాల్ చేయాలని, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వెల్కటూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు అడిగేవారిని నమ్మవద్దని, అది మోసమని హెచ్చరించారు. ఫోన్లకు వచ్చే ఉచిత బహుమతుల లింకులను క్లిక్ చేయవద్దని, పొరపాటున క్లిక్ చేస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. యువత స్మార్ట్‌ఫోన్‌ను జ్ఞానం పెంచుకోవడానికి, ఆన్‌లైన్ ఈ-లైబ్రరీ ద్వారా చదువుకోవడానికి ఉపయోగించుకోవాలని సూచించారు. ఆడపిల్లలపై వివక్ష చూపకుండా వారి కలలు, ప్రతిభను గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్ రహిత సురక్షిత సిద్దిపేట నిర్మాణానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, అదనపు డీసీపీ ఏఆర్ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీబాబు తదితరులు పాల్గొన్నారు.
