ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి.

రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

Published On
ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ ), ఆగస్టు 07 :
ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు తక్కువ నీటి అవసరంతో ఎక్కువ దిగుబడి వచ్చే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వానాకాలం సాగు, వన మహోత్సవం, పంట కుంటలు, స్మార్ట్ రేషన్ కార్డుల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్నందున రైతులు వరి మినహా తక్కువ నీటి అవసరం ఉన్న ఆరుతడి పంటలు సాగు చేసే విధంగా దృష్టి సారించాలని తెలిపారు. ఆ దిశగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లాల వారీగా పరిశీలించగా 3 జిల్లాలలో అధిక వర్షపాతం, 21 జిల్లాలలో సాధారణ వర్షపాతం, 9 జిల్లాలలో లోటు వర్షపాతం నమోదయిందని అన్నారు. మండలాల వారీగా 126 మండలాలలో అధిక వర్షపాతం, 282 మండలాలలో సాధారణ వర్షపాతం, 205 మండలాలలో లోటు, 8 మండలాలలో భారీ లోటు వర్షపాతం నమోదయిందని తెలిపారు. భూగర్భ జలాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సాగు అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో వానాకాలం 2026 లో సాధారణ సాగు విస్తీర్ణం  1 కోటి 32 లక్షల 38 వేల 714 ఎకరాల కాగా తుది సాగు విస్తీర్ణం 1 కోటి ఎనిమిది లక్షల 22 వేల 389 ఎకరాలుగా ఉందని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 99.81 లక్షల ఎకరాలలో పంటల సాగు జరిగిందని, పత్తి సుమారు 47.25 లక్షల ఎకరాలు, పప్పు ధాన్యాలు సుమారు 6.14 లక్షల ఎకరాలు, నూనె గింజలు సుమారు 3.76 లక్షల ఎకరాలు, చెరుకు సుమారు 38 వేల 149 ఎకరాలు, కూరగాయలు సుమారు 43 వేల 802 ఎకరాలలో సాగు జరుగుతుందని తెలిపారు. జూలై నెలలో నిర్వహించిన విత్తన మేళాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, 3 వేల 116 మంది రైతులు వివిధ పంటలకు సంబంధించిన విత్తనాలు కొనుగోలు చేశారని తెలిపారు. వానాకాలం సాగు అవసరాల కోసం గోదావరి, కృష్ణా బేసిన్లలోని ప్రాజెక్టుల ద్వారా సాగునీటి విడుదలకు కార్యాచరణ సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు.

*వన మహోత్సవం*

2026 వన మహోత్సవం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించగా ఇప్పటి వరకు 6.28 కోట్ల మొక్కలు నాటడం/ పంపిణీ చేయడం ద్వారా 39 శాతం ప్రగతి సాధించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నర్సరీల్లో 16.29 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, అవెన్యూ ప్లాంటేషన్ క్రింద 176.959 కిలోమీటర్ల మేర రహదారుల వెంట, కాలువ కట్టలు, చెరువుగట్లు, వ్యవసాయ భూముల కట్టల వెంట మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బ్లాక్ ప్లాంటేషన్ లో సామాజిక, వ్యవసాయ, చెరువు శిఖం, ప్రభుత్వ భూములు, స్మృతి వనాలు, డంపింగ్ యార్డు, స్మశాన వాటిక లలో, సంస్థాగత ప్లాంటేషన్ లో ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, కళాశాలలు, పాఠశాలలు, హౌసింగ్ కాలనీలు, ఆసుపత్రులు, ఇతర సంస్థలలో, ఇంటి ఆవరణలలో, పారిశ్రామిక ప్రాంతాలలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు మొక్కలు నాటేందుకు లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని, నాటిన ప్రతి మొక్కను తప్పనిసరిగా TGFMIS పోర్టల్‌లో జియో ట్యాగింగ్ చేసి, వాటి మనుగడ శాతాన్ని నిరంతరం నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

*సమగ్ర వ్యవసాయ క్షేత్ర చెరువులు*

స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సమగ్ర వ్యవసాయ క్షేత్ర చెరువుల పథకం పనులను వేగవంతం చేయాలని తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాలలో 13 వేల 46 క్షేత్ర చెరువుల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించగా ఈ  నెల 15 నాటికి అన్ని పనులను ప్రారంభించి పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. "ఒకే చెరువు – ఆరు రకాల జీవనోపాధులు" అనే భావనతో నీటిపారుదల, చేపల పెంపకం, పాడి పరిశ్రమ, కూరగాయల సాగు, పశు గ్రాస అభివృద్ధి, సేంద్రీయ ఎరువుల తయారీ వంటి కార్యక్రమాల ద్వారా మహిళా రైతుల ఆదాయాన్ని పెంచేలా శాఖల మధ్య సమన్వయంతో పని చేయాలని సూచించారు.

*స్మార్ట్ రేషన్ కార్డుల అమలు*

పౌర సరఫరాల వ్యవస్థను మరింత పారదర్శకంగా, భద్రతాయుతంగా మార్చేందుకు ప్రభుత్వం తెలంగాణ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెడుతుందని తెలిపారు. డిజిటల్ సంతకం, హోలోగ్రామ్, వాటర్‌మార్క్, ఎన్‌క్రిప్టెడ్ క్యు.ఆర్ కోడ్, యు.వి. లోగో తదితర అత్యాధునిక భద్రతా ఫీచర్లతో స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందించడం జరిగిందని తెలిపారు. మొత్తం 1 కోటి 6 లక్షల 20 వేల 92 రేషన్ కార్డుల ద్వారా 3 కోట్ల 42 లక్షల 57 వేల 109 మంది లబ్ధిదారులకు ప్రతినెల 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 16 లక్షల 32 వేల 810 రేషన్ కార్డులు జారీ చేయడం జరిగిందని తెలిపారు.
    వర్షపాతం, భూగర్భ జలాలు, పంటల సాగు, విత్తనాల లభ్యత, సాగునీటి పరిస్థితులను జిల్లా స్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని, వన మహోత్సవం లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయడంతో పాటు ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేసి మనుగడను పర్యవేక్షించాలని సూచించారు. సమగ్ర వ్యవసాయ క్షేత్ర చెరువుల పనులను వేగవంతం చేసి, తెలంగాణ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.
   వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఆర్డీఓ సాయన్న, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News