తరగతి సమయాల్లో ఇతర కార్యక్రమాలు వద్దు :

భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

Published On
తరగతి సమయాల్లో ఇతర కార్యక్రమాలు వద్దు :

 

టేకులపల్లి, లోకల్ గైడ్ న్యూస్ (భద్రాద్రి జిల్లా బ్యూరో) :
ఏకలవ్య పాఠశాలలో తరగతి సమయాన్ని పూర్తిగా విద్యాబోధనకే కేటాయించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. టేకులపల్లి మండలంలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, ప్రయోగశాలలు, భోజనం, పరిశుభ్రత, యూనిఫాంలు, వెల్నెస్ సెంటర్ తదితర అంశాలను పరిశీలించారు. 8, 9, 10వ తరగతుల గదులను పరిశీలించిన కలెక్టర్ కొన్ని తరగతుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంపై ఆరా తీశారు. గ్రామసభ, విద్యార్థి పార్లమెంట్, బ్యాంకు ఖాతాల ప్రారంభం వంటి కార్యక్రమాల కోసం విద్యార్థులు తరగతులకు దూరంగా ఉన్నట్లు అధికారులు వివరించారు. ఇకపై ఇలాంటి కార్యక్రమాలను తరగతుల అనంతరం లేదా శనివారాల్లో నిర్వహించాలని సూచించారు. భౌతిక శాస్త్ర ప్రయోగశాలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి ప్రయోగాలపై అవగాహనను తెలుసుకున్నారు. పాఠ్యాంశాలను పుస్తకాలకే పరిమితం చేయకుండా ప్రయోగాత్మకంగా బోధించాలని, ప్రతి విద్యార్థి ప్రయోగాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని అన్నారు. కొత్తగా చేరిన విద్యార్థులకు యూనిఫాంలు త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం భోజనశాల, వంటగది, మరుగుదొడ్లను పరిశీలించి పరిశుభ్రత లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని సూచించారు. స్టోర్ రూమ్‌లోని కూరగాయలు, పాలు, పెరుగు నాణ్యతను పరిశీలించి ఆహార నాణ్యత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వెల్నెస్ సెంటర్‌లో మందుల నిల్వ, రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాబోధన, ప్రయోగాత్మక విద్య, ఆహారం, పరిశుభ్రత, ఆరోగ్యం వంటి అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News