హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 09
(లోకల్ గైడ్ న్యూస్)
హనుమకొండ సెప్టెంబర్ 11న జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు హాజరవుతున్నారని సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆదరి శ్రీనివాస్ అధ్యక్షతన సిపిఐ ముఖ్య నాయకుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 11 నుండి 17 వరకు జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రద చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి ప్రజలకు కోరారు. ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినా కూడా తెలంగాణ ప్రాంతం నైజాం రాజు ఆధీనంలో ఉండి నియంత, నిరంకుశ పాలన వల్ల భూస్వాములు, పటేల్ ,పట్వారి లు గ్రామాలలో తమ ఆగడాలు పెట్రేగి పోతున్న సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరి, బానిసత్వంకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, మక్దూం మొయినుద్దీన్ పిలుపునిచ్చారని తెలిపారు. ఆ పిలుపునందుకుని 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిందని, 3000 గ్రామాలను విముక్తి చేసిందని, 4500 మంది కమ్యూనిస్టులు తమ రక్తాన్ని చిందించి ప్రపంచ చరిత్రను సృష్టించారని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో ఏ గ్రామానికి ఏ ప్రాంతానికి పోయినా కూడా నాటి ఆనవాళ్లు ఇంకా కొనసాగుతూ ఉన్నాయని, పాలక ప్రభుత్వాలు ఈ చరిత్రను పాఠ్యాంశాలు చేర్చాలని ఈ చరిత్రను నేటి తరానికి అందించాలని డిమాండ్ చేస్తున్న కూడా పెడచెవిన పెడుతున్నారని అన్నారు. ట్యాంక్ బండి పై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న నాయకుల విగ్రహాలను, సంఘటనలో జరిగిన ప్రాంతాలలో ప్రభుత్వాధికారకంగా టూరిజం పరంగా అభివృద్ధి చేయాలని అన్నారు. సెప్టెంబర్ 11న హనుమకొండ జిల్లా కేంద్రంలో సీపీఐ జిల్లా కార్యాలయం నుండి ఏకశిల పార్క్ వరకు వందలాది మందితో ర్యాలీ నిర్వహించి టాను నాయక్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు హాజరవుతున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సిరబోయిన కరుణాకర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏదునూరి వెంకటరాజం, కొట్టే పాక రవి తదితరులు పాల్గొన్నారు.