- District News
- Nalgonda
- అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
నూతన కోర్సులు, విధానాలతో విద్యకు మరింత చేరువ.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.
విద్యను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధునిక అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులు, విద్యా విధానాలను అమలు చేస్తోందని ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ సెంటర్ నోడల్ అధికారి డాక్టర్ బి. ధర్మ నాయక్ తెలిపారు. ఆదివారం నల్లగొండ రీజినల్ కేంద్రంలో అధ్యయన కేంద్రాల కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో *డాక్టర్ ధర్మ నాయక్ మాట్లాడారు.2026 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని, అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 9లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివిధ కారణాలతో రెగ్యులర్ విద్యను కొనసాగించలేకపోయిన వారికి ఓపెన్ యూనివర్సిటీ విద్య ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో విద్యార్థులు తమకు అనుకూలమైన సమయంలో, సొంత వేగంతో చదువుకునే అవకాశం ఉంటుందన్నారు.
యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఆధ్వర్యంలో మారుతున్న కాలానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా నూతన కోర్సులను రూపొందిస్తున్నట్లు ధర్మ నాయక్ తెలిపారు. నూతన కోర్సుల ద్వారా ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. యూజీ, పీజీ కోర్సులతో పాటు డిప్లొమా, సర్టిఫికెట్, నైపుణ్యాధారిత కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
సాంకేతికతను వినియోగించి విద్యను మరింత సులభతరం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు.
అదేవిదంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా రిజిస్ట్రార్ ఎల్.వి.కె. రెడ్డి* మాట్లాడుతూ ఓపెన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న వారికి చదువుతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే, టీసిఎస్,ఐకాన్ రామానంద తీర్థ ఇన్‌స్టిట్యూట్, రాశి, వి-హబ్ వంటి సంస్థలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు గుర్తుచేశారు.ప్రతి విద్యా సంవత్సరంలో నల్లగొండ జిల్లా నుంచి యూజీ, పీజీ అడ్మిషన్లు అత్యధికంగా ఉంటాయని, ఈ ఏడాది కూడా అడ్మిషన్లలో నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో *రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ అనిల్ బొజ్జ, మహిళ డిగ్రీ కళాశాల కో-ఆర్డినేటర్ రాజారామ్ అధ్యయన కేంద్రాల కౌన్సిలర్లు *శ్రీకాంత్, మహేష్ పాల్గొన్నారు.
