వరి సాగుపై  ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి -

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి.

Published On
వరి సాగుపై  ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి -

 రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):                   వరిసాగుపై పూర్తిగా ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు. 
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు వరి సాగుపై పూర్తిగా ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ పంటల సాగు, కూరగాయల సాగు వైపు మొగ్గు చూపాలని తెలిపారు. ప్రస్తుత వాతావరణ అంచనాలు, నీటి లభ్యత, జలాశయాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులు సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. అధిక నీటి అవసరం ఉండే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, మొక్కజొన్న, నువ్వులు వంటి పంటలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు కూడా వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని సూచించారు.
         అనిశ్చిత వర్షపాతం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పంట నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని, అందువల్ల వాతావరణ హెచ్చరికలు, వ్యవసాయ శాఖ సూచనలను నిరంతరం అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు.  అదేవిధంగా సెప్టెంబర్ నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి, ఐఏఎస్ సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి అవసరం ఉండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడంతో పాటు, వ్యవసాయ శాఖ అధికారుల సాంకేతిక సూచనలను పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని కోరారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో వ్యవసాయం చేయడం ద్వారా పంట నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News