గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను ప్రణాళికాబద్దంగా చేపట్టాలి.

అధికారులకు కలెక్టర్ భవేష్ మిశ్రా దిశానిర్దేశం

యంచ వద్ద పుష్కరఘాట్ నిర్మాణానికి అనువైన స్థలం పరిశీలన
Published On
గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను ప్రణాళికాబద్దంగా చేపట్టాలి.

IMG-20260818-WA0157నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగస్టు 18 :

గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నవీపేట మండలం యంచ వద్ద పుష్కర ఘాట్ నిర్మాణానికి నిధులు మంజూరైన నేపధ్యంలో కలెక్టర్ మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి అనువైన స్థలం కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో ముఖాముఖి భేటీ అయి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. యంచ గ్రామ శివారులో ఎక్కడ పుష్కర ఘాట్ ఏర్పాటు చేస్తే భక్తులకు అనుకూలంగా ఉంటుంది, అవసరమైన స్థలం అందుబాటులో ఉందా, రవాణా వసతి, ఇతర సదుపాయాలు, భద్రతాపరమైన అంశాలు తదితర వాటి గురించి సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన అన్ని అంశాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రభుత్వం నిర్ధారణ చేసిన ప్రాంతంలోనే పుష్కరఘాట్ నిర్మాణం చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. పరిశీలన జరిపిన ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఏమేరకు అందుబాటులో ఉంది, పట్టా భూములు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయన్నది పక్కాగా సర్వే నిర్వహించి వారం రోజుల్లోపు మార్కింగ్ పూర్తి చేయాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించేలా ప్రభుత్వం సంకల్పించిన దృష్ట్యా, విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా పనులను చేపట్టి, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర దేవాలయం యంచ గ్రామానికి అత్యంత చేరువలో ఉన్నందున గోదావరి పుష్కర పుణ్య స్నానాల కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున లోటుపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. కలెక్టర్ వెంట రెవెన్యూ, ఇరిగేషన్, ఎండోమెంట్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఉన్నారు.

Tags:

About The Author

Latest News