ప్రజా నాయకుడికి పట్టాభిషేకం మేకగూడ సింగిల్ విండో చైర్మన్ గా అంబటి ప్రభాకర్

కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డ వ్యక్తికి..నేడు పార్టీలో దక్కిన బహుమానం

ఎమ్మెల్యే శంకరన్నకు రుణపడి ఉంటా మేకగూడ నూతన సింగిల్ విండో చైర్మన్ అంబటి ప్రభాకర్
Published On
ప్రజా నాయకుడికి పట్టాభిషేకం మేకగూడ సింగిల్ విండో చైర్మన్ గా అంబటి ప్రభాకర్

కొత్తూర్ ఆగస్టు 08 

 ప్రజా నాయకుడు అంబటి ప్రభాకర్ కు నేడు మేకగూడ నూతన సింగిల్ విండో చైర్మన్ గా పట్టాభిషేకం వరించింది.ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి,కార్యకర్త స్థాయి నుండి నేడు సింగిల్ విండో చైర్మన్ స్థానాన్ని అధిరోహించే వరకు ఆయన సాగించిన ప్రయాణం ఎందరికో ఆదర్శం.దశాబ్దాల కష్టం, మొక్కవోని ధైర్యం,నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే గుణమే ఆయనను ఈరోజు ప్రజా హృదయాలలో నిలిపాయి.క్షేత్రస్థాయిలో రైతుల కష్టసుఖాలను కళ్లారా చూస్తూ పెరిగిన ప్రభాకర్ కు వ్యవసాయం అంటే ప్రాణం. 90వ దశకంలో రైతులందరూ సంప్రదాయ పంటల వైపు మొగ్గు చూపితే, ఆయన మాత్రం పాత పద్ధతులకు భిన్నంగా, తన వారసత్వంగా వచ్చిన పొలంలో సరికొత్త వంగడాలను సాగు చేసి ఎంతో మంది స్థానిక రైతులకు దిక్సూచిగా నిలిచారు. కాలక్రమేణా ఆర్థికంగా నిలదొక్కుకుని, పిల్లల ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌లో స్థిరపడినప్పటికీ అంబటి ప్రభాకర్ మనసంతా సొంత గ్రామం పైనే ఉండేది.చేతిలో ఎలాంటి పదవి లేకపోయిన ఊరిపై మక్కువతో గ్రామాల్లోని వాడవాడలా ఎన్నో చెట్లను నాటించి తన పర్యావరణ ప్రేమని చాటుకున్నారు.ఒక వ్యక్తి మరణిస్తే..చివరి వరకు, చితిలో కూడా తోడు వచ్చేది మనం నాటిన చెట్టే అనే అంబటి ప్రభాకర్ మాటలు ఆయన సామాజిక దృక్పథానికి, జీవిత సత్యానికి నిదర్శనం. ఇలాంటి ఎన్నో నిశ్శబ్ద విప్లవాలు, సామాజిక కార్యక్రమాలు ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేశాయి.సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ప్రభాకర్  రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని ప్రజలే బలంగా ఆకాంక్షించారు. ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ ఎస్‌బి పల్లి సర్పంచ్‌గా ఆయన భారీ మద్దతుతో గెలుపొందారు. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన,తనదైన మార్కు పాలనతో,అభివృద్ధి పథకాలతో ఎస్‌బి పల్లిని మండలం, జిల్లాలోనే అగ్రభాగాన నిలబెట్టి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు.

 *కష్టకాలంలో వెన్నుచూపని ధైర్యం..*

గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ, అంబటి ప్రభాకర్ ఎన్నడూ అధైర్యపడలేదు.అప్పటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతూ ప్రజల గొంతుకగా నిలిచారు.పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచి, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కి అత్యంత ముఖ్య అనుచరుడిగా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి సేవలందించారు.అంబటి ప్రభాకర్ పడ్డ దశాబ్దాల కష్టానికి,పార్టీ పట్ల ఆయనకున్న అచంచలమైన విధేయతకు దక్కిన ఉన్నతమైన గౌరవమే ఈ పిఎసిఎస్ చైర్మన్ పదవి. ఒక సామాన్య కార్యకర్తగా ప్రయాణాన్ని ప్రారంభించి, నేడు ఒక బాధ్యతాయుతమైన చైర్మన్ స్థానాన్ని అధిరోహించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. ప్రజాసేవకుడు,రైతు బిడ్డ అయిన ప్రభాకర్ ను అధిష్టానం ఈ పదవికి ఎంపిక చేయడం పట్ల గ్రామస్థులు,పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.తన పదవికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డికి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లారం శేఖర్ రెడ్డికి, పార్టీ కార్యకర్తలు అందరికి రుణపడి ఉంటా అని నూతన సింగిల్ విండో చైర్మన్ అంబటి ప్రభాకర్ తెలియజేశారు.

Tags:

About The Author

Latest News