- District News
- Ranga Reddy
- గురువులకు ఘన సన్మానం
గురువులకు ఘన సన్మానం
150 మంది ఉపాధ్యాయులను సత్కరించిన విద్యాశాఖ
లోకల్ గైడ్ ఆమనగల్లు, సెప్టెంబర్ 19:
గురువుల సేవలను గుర్తిస్తూ ఆమనగల్లు పట్టణంలోని మానస గార్డెన్స్‌లో శనివారం గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆమనగల్లు మండల విద్యాధికారి పగిడిపాల పాండు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలోని సుమారు 150 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్. పత్యానాయక్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సమాజ నిర్మాణంలో గురువులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సన్మానించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబోధనతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను నేర్పుతూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని పేర్కొన్నారు. గురువులను గౌరవించడం మన సంప్రదాయంలో భాగమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం, మున్సిపల్ కమిషనర్ ఎస్. రాఘవేందర్ రెడ్డి, సంఘ సేవకులు పాపిశెట్టి రాము, నక్క శ్రీనివాస్ యాదవ్, క్లాస్‌మేట్ క్లబ్ అధ్యక్షులు జీహెచ్‌ఎం రమేష్, వాసవి ట్రస్ట్ చైర్మన్ చంద్రశేఖర్, కౌన్సిలర్ జగన్, అనూష, శ్రీశైలం, జీహెచ్‌ఎం పద్మ, చందులాల్, సంఘ బాధ్యులు, మండలంలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
