- District News
- Ranga Reddy
- మహాత్ముడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శం
మహాత్ముడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శం
జాతిపితకు ఘనంగా నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి
సత్యం, అహింసలను ఆయుధాలుగా మలిచి దేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టిన జాతిపిత మహాత్మా గాంధీ సేవలు చిరస్మరణీయమని ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి కొనియాడారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శేరిగూడ చౌరస్తాలోని గాంధీజీ విగ్రహానికి బీఆర్‌ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు అల్వాల్ వెంకట్ రెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి ఆయుధాలు లేకుండా కేవలం శాంతి, అహింసా మార్గాల్లో బ్రిటిష్ పాలకులను గడగడ లాడించిన మహనీయుడు గాంధీజీ అని పేర్కొన్నారు. ప్రజల్లో ఐక్యత, సమానత్వం, సోదరభావాలను పెంపొందించి దేశ ప్రజలందరినీ ఉద్యమం వైపు నడిపించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మహాత్ముడు చూపిన శాంతియుత పోరాట పంథా, ప్రజాస్వామ్య విలువలు నేటి తరానికి ఎంతగానో స్ఫూర్తిదాయకమని చెప్పారు. గాంధీజీ ఆశయాలను నిత్య జీవితంలో ఆచరించినప్పుడే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని, సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపాలిటీ సిబ్బంది, కార్యకర్తలు పాల్గొని గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు.
