- District News
- Ranga Reddy
- కల్వకుర్తి అభివృద్ధికి భారీ ప్రతిపాదనలు.. సీఎం రేవంత్‌రెడ్డి ని కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి
కల్వకుర్తి అభివృద్ధికి భారీ ప్రతిపాదనలు.. సీఎం రేవంత్‌రెడ్డి ని కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి
రూ.80 కోట్లతో ఆమనగల్లు, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో సీసీ రోడ్లు–యూజీడీ పనులు | అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లకు విజ్ఞప్తి | గ్రామాల యూజీడీకి రూ.50 కోట్లు కోరిన ఎమ్మెల్యే
న్యూ స్టార్ట్
లోకల్ గైడ్ – ఆమనగల్లు, ఆగస్టు 12:
కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కీలక ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి నివాసంలో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే, నియోజకవర్గంలోని మౌలిక వసతులు, పేదల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై ప్రత్యేకంగా ప్రతిపాదనలు సమర్పించారు.
ఆమనగల్లు, కల్వకుర్తి కి రూ.80 కోట్ల నిధులు
ఆమనగల్లు, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యు జి డి) పనులకు మొత్తం రూ.80 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఇందులో ఆమనగల్లు మున్సిపాలిటీకి రూ.30 కోట్లు, కల్వకుర్తి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు.
అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లకు విజ్ఞప్తి
కల్వకుర్తి నియోజకవర్గంలో పేదలు, లంబాడీ కుటుంబాలు అధికంగా ఉన్న నేపథ్యంలో గృహ అవసరం కూడా ఎక్కువగా ఉందని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అర్హులైన నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
గ్రామాలకు రూ.50 కోట్లతో యు జి డి
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, గ్రామపంచాయతీ ల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, మురుగునీటి నిర్వహణను మెరుగుపరిచి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిపారు.
అభివృద్ధే లక్ష్యంగా ప్రతిపాదనలు
కల్వకుర్తి నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనలు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే సమర్పించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించి, అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది.
కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి, పేదల సంక్షేమం, మెరుగైన మౌలిక వసతులే లక్ష్యంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
