- District News
- Ranga Reddy
- ఈ నెల 27న గ్రామ/వార్డు సభల్లో ఓటర్లు తమ పేర్లను తప్పనిసరిగా పరిశీలించుకోవాలి
ఈ నెల 27న గ్రామ/వార్డు సభల్లో ఓటర్లు తమ పేర్లను తప్పనిసరిగా పరిశీలించుకోవాలి
ఓటర్ల జాబితాలో పేరు, వివరాలను సరిచూసుకుని అవసరమైన సవరణలకు దరఖాస్తు చేసుకోవాలి: జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి
రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ): ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27వ తేదీన జిల్లాలోని గ్రామాలు, వార్డుల్లో గ్రామ/వార్డు సభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. ఈ సభలకు ప్రజలు తప్పనిసరిగా హాజరై ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయా లేదా పరిశీలించుకోవాలని ఆయన సూచించారు.
ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా, పారదర్శకంగా రూపొందించడమే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. గ్రామ/వార్డు సభల సందర్భంగా సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బి ఎల్ ఓ ) అందుబాటులో ఉండి ఓటర్ల జాబితా వివరాలను ప్రజలకు తెలియజేస్తారని పేర్కొన్నారు.
పేరు, వివరాలను సరిచూసుకోవాలి
ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ/వార్డు సభలకు హాజరై ఓటర్ల జాబితాలో తమ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా—
- తమ పేరు ఓటర్ల జాబితాలో నమోదై ఉందా లేదా;
- పేరు, ఇంటి పేరు తదితర వివరాలు సక్రమంగా ఉన్నాయా;
- వయస్సు, లింగం వంటి వివరాల్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా;
- చిరునామా, పోలింగ్ కేంద్రం వివరాలు సరిగ్గా ఉన్నాయా;
- కుటుంబ సభ్యులందరి పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయా;
అనే అంశాలను పరిశీలించుకోవాలని తెలిపారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి
అర్హత ఉన్నప్పటికీ ఓటర్ల జాబితాలో పేరు నమోదు కాకపోయినా, ఇప్పటికే నమోదైన పేరులో ఏదైనా తప్పు ఉన్నా, చిరునామా మారినా లేదా ఇతర వివరాల్లో మార్పులు అవసరమైనా సంబంధిత బి ఎల్ ఓ లను సంప్రదించి ఎన్నికల నిబంధనల ప్రకారం సంబంధిత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
యువ ఓటర్లు ప్రత్యేకంగా పరిశీలించుకోవాలి
18 సంవత్సరాలు పూర్తి చేసిన అర్హులైన యువత తమ పేరు ఓటర్ల జాబితాలో నమోదైందో లేదో ప్రత్యేకంగా పరిశీలించుకోవాలని సి. నారాయణ రెడ్డి కోరారు. కుటుంబంలో కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఉంటే వారి పేర్లు కూడా జాబితాలో ఉన్నాయా లేదా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పరిశీలించుకోవాలని సూచించారు.
అదేవిధంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నివాసం మారిన ఓటర్లు తమ ప్రస్తుత నివాస ప్రాంతానికి సంబంధించిన పోలింగ్ కేంద్రంలో తమ పేరు నమోదై ఉందో లేదో పరిశీలించుకోవాలని తెలిపారు.
తప్పులు, అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలి
ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం, ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదై ఉండటం, మరణించిన వ్యక్తుల పేర్లు కొనసాగడం, తప్పు చిరునామా లేదా ఇతర వివరాలు నమోదై ఉండటం వంటి అంశాలను గుర్తించినట్లయితే వెంటనే సంబంధిత బి ఎల్ ఓ లు, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు.
అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటం, అనర్హమైన లేదా తప్పుగా నమోదైన వివరాలను నిబంధనల ప్రకారం సరిచేయడం ఎస్ ఐ అర్ కార్యక్రమం లక్ష్యమని ఆయన తెలిపారు.
ఓటర్ల జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైనదని, దీనిని కేవలం అధికారుల బాధ్యతగా భావించకుండా ప్రతి పౌరుడు బాధ్యతగా పాల్గొనాలని జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి కోరారు.
ఈ నెల 27న నిర్వహించే గ్రామ/వార్డు సభలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయా లేదా పరిశీలించుకోవాలని, ఏవైనా తప్పులు, లోపాలు లేదా అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత బి ఎల్ ఓ లకు తెలియజేసి అవసరమైన సవరణలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
