- District News
- మహిళా ప్రజాప్రతినిధులపై నిర్బంధమా?
మహిళా ప్రజాప్రతినిధులపై నిర్బంధమా?
కాంగ్రెస్ వైఖరిపై భగ్గుమన్న అశ్వారావుపేట సబిత, సునీతలపై దౌర్జన్యం, దూషణలను ఖండిస్తూ బీఆర్ఎస్ మహాధర్నా
లోకల్ గైడ్ : అశ్వారావుపేట
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ పోకడలు, ప్రతిపక్ష గొంతు నొక్కే కుట్రలపై బీఆర్ఎస్ శ్రేణులు కన్నెర్రజేశాయి. పార్టీ శాసనసభ్యులతో పాటు సీనియర్ మహిళా ప్రజాప్రతినిధులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని, వారి పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించడాన్ని ఖండిస్తూ అశ్వారావుపేట మండల కేంద్రం నిరసనలతో దద్దరిల్లింది. కాంగ్రెస్ నేతలు మహిళా ఎమ్మెల్యేలపై అసభ్య పదజాలంతో చేసిన దూషణలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
*అంబేద్కర్ పాదాల చెంత ఆక్రోశం*
కాసాని పద్మ, కౌన్సిలర్ ఉదయజ్యోతి నేతృత్వంలో స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న మహిళా నేతలు, కార్యకర్తలు బాబాసాహెబ్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం యథేచ్ఛగా కాలరాస్తోందని, నిరసన తెలిపే ప్రాథమిక హక్కును కూడా లాక్కొని పోలీసుల ద్వారా రాజ్యమేలుతోందని నేతలు దుయ్యబట్టారు. చట్టసభల్లో ప్రజల పక్షాన నిలిచే మహిళా నేతలకే భద్రత, గౌరవం లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
*రింగ్ రోడ్ కేంద్రంగా హోరెత్తిన ఆందోళన*
అనంతరం అశ్వారావుపేట ప్రధాన రింగ్ రోడ్డు కూడలికి భారీ ర్యాలీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా చెదరగొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ, నాయకులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పోలీసుల వలయాన్ని ఛేదిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తే అరెస్టులతో బెదిరించడం పాలకుల అసహనానికి నిదర్శనమని, రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు భూక్యా ప్రసాద్, జుజ్జురపు శ్రీరామ్ మూర్తి, వగ్గెల పూజా, సత్యవరపు సంపూర్ణ, గుడవర్తి వెంకటేశ్వరరావు, సర్పంచ్‌లు సోడెం భారతి, మిద్దిన వెంకట నరసమ్మ, తోట వెంకటమ్మలతో పాటు కొనసోతు నవీన్, రహీం మునీషా, ఇస్లావత్ లక్ష్మి, ఆరేపల్లి సౌజన్య, మోటూరి మోహన్, ఎస్.కె. రఫీ, శెట్టిపల్లి రఘురాం, బుద్దె పద్మ, జాక్కం బలరాం, జుజ్జురపు రాంబాబు, నార్లపాటి చిన్న అబ్బాయి, గంధం ఆనంద్, బానోత్ ఆదిలక్ష్మి, బానోత్ జ్యోతి, నార్లపాటి అనిల్, కొనసోతు తిరుపతమ్మ, భూక్యా ఉమా, భూక్యా పద్మ, సెగ్గెం రవి, బాలికొండ కిరణ్, అఖిల్, సోమని రమేష్, మందపాటి రవి, రాయల్ భరత్ తదితరులు, పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
