- District News
- Ranga Reddy
- డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌కు మణికొండకు పరుగులా?
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌కు మణికొండకు పరుగులా?
షాద్‌నగర్‌లోనే ఆన్‌లైన్ అప్రూవల్ కేంద్రం ఏర్పాటు చేయాలి. ప్రజల సమయం, డబ్బు వృథా చేస్తున్న అధికారుల విధానంపై తీవ్ర అసంతృప్తి
షాద్‌నగర్, లోకల్ గైడ్ తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్‌లను రెన్యువల్ చేయించుకునేందుకు షాద్‌నగర్ ఆర్టీవో కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్న ప్రజలకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అనంతరం అప్లికేషన్ నంబర్ అప్రూవల్ కోసం రంగారెడ్డి జిల్లా కార్యాలయం మణికొండకు స్వయంగా వెళ్లాల్సి వస్తోందని, షాద్‌నగర్ ఆర్టీవో కార్యాలయ సిబ్బంది చెబుతున్నారని వారు పేర్కొంటున్నారు.
“ఒక డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఇంత దూరం ఎందుకు వెళ్లాలి?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ సేవలను స్థానికంగానే అందించే అవకాశం ఉన్నప్పటికీ, అనవసరంగా జిల్లా కార్యాలయానికి పంపడం వల్ల వృద్ధులు, మహిళలు, ఉద్యోగులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పలుమార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితం శూన్యం
షాద్‌నగర్ ఆర్టీవో కార్యాలయంలోనే గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్‌ల రెన్యువల్‌కు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ నంబర్ అప్రూవల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లతో పాటు సంబంధిత అధికారులకు పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రజల సమస్యను అధికారులు పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని వారు అంటున్నారు. ప్రభుత్వం డిజిటల్ సేవలను ప్రజలకు చేరువ చేస్తున్న సమయంలో, ఒక చిన్న అప్రూవల్ ప్రక్రియ కోసం ప్రజలను సుదూర ప్రాంతాలకు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
ఇకనైనా అధికారులు స్పందించాలి
షాద్‌నగర్ ప్రాంత ప్రజల ఇబ్బందులను, వారి సమయాన్ని, ప్రయాణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని షాద్‌నగర్ ఆర్టీవో కార్యాలయంలోనే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌కు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ నంబర్ అప్రూవల్ కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మణికొండలోని జిల్లా కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా షాద్‌నగర్‌లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా తగిన సాంకేతిక, పరిపాలనా సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు.
ప్రజల సమస్యలను అధికారులు ఇకనైనా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు.
“ప్రజలకు సేవ చేయాల్సిన కార్యాలయం.. ప్రజలను దూర ప్రాంతాలకు పంపించే కేంద్రంగా మారకూడదు. షాద్‌నగర్ ప్రజల ఇబ్బందులకు వెంటనే ముగింపు పలకాలి” అని వాహనదారులు స్పష్టం చేస్తున్నారు.
