హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు
(లోకల్ గైడ్ న్యూస్):
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు అందుతున్న ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, రీఫిల్ సబ్సిడీ, గ్యాస్ వినియోగ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వాన్ని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. గత మూడేళ్లలో వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఎన్ని ఉజ్వల కనెక్షన్లు ఇచ్చారు.? పేద కుటుంబాలు గ్యాస్ సిలిండర్లను నిరంతరం వినియోగించేలా రీఫిల్ ధరలను అందుబాటులో ఉంచేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు ఏమిటి? అనే అంశాలపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.ఈమేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2026 జూలై 1 నాటికి 1.22 లక్షల ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు వెల్లడించారు. 2023-24లో 2,928, 2024-25లో 84, 2025-26లో 2,835 కనెక్షన్లు మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. జిల్లాల వారీగా జనగామలో 1,825, హనుమకొండలో 1,359, వరంగల్‌లో 760, జయశంకర్ భూపాలపల్లిలో 1,903 కనెక్షన్లు గత మూడేళ్లలో విడుదలైనట్లు వివరించింది.ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ, పేద మహిళల జీవన నాణ్యతను మెరుగుపర్చేందుకు ఉజ్వల పథకం ఎంత కీలకమైనా, కనెక్షన్ ఇచ్చినంత మాత్రాన లక్ష్యం నెరవేరినట్లు కాదని అన్నారు. ప్రతి పేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా గ్యాస్ సిలిండర్‌ను క్రమం తప్పకుండా రీఫిల్ చేసుకునే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఇంకా అర్హులైన కుటుంబాలు మిగలకుండా ఉజ్వల కనెక్షన్లు ఇవ్వాలని, రీఫిల్ సబ్సిడీని కొనసాగించడంతో పాటు అవసరమైతే మరింత పెంచాలని కేంద్రాన్ని కోరారు.