పెద్దపల్లి , సెప్టెంబర్ 10: ( లోకల్ గైడ్ )
ఉపసర్పంచ్‌ల చెక్ పవర్‌ను కొనసాగించాలని ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు పరస్పర సమన్వయంతో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో కార్తీక్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కొందరు సర్పంచ్‌లు ఉపసర్పంచ్‌ల చెక్ పవర్‌ను తొలగించాలని కోరుతూ కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం బాధాకరమన్నారు. గ్రామాల అభివృద్ధిలో ఉపసర్పంచ్‌లు సర్పంచ్‌లతో కలిసి కీలకంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఉపసర్పంచ్‌లకు గౌరవ వేతనం, విధులు, అధికారాల వంటి అంశాలపై గతంలో పెద్దగా స్పందించని వారు ప్రస్తుతం కేవలం చెక్ పవర్‌ను తొలగించాలని కోరడం సమంజసం కాదని కార్తీక్ అన్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉపసర్పంచ్‌ల చెక్ పవర్ అంశంపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గ్రామపంచాయతీల్లో పారదర్శక పాలన, అభివృద్ధి కోసం సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు కలిసి పనిచేయాలని సూచించారు. అవినీతికి పాల్పడే ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజాయితీగా పనిచేస్తున్న ఉపసర్పంచ్‌లకు చెక్ పవర్ ఉండటం వల్ల గ్రామపంచాయతీల ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకతకు అవకాశం ఉంటుందని కార్తీక్ పేర్కొన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్న మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు జంగా అనిల్, రాష్ట్ర కార్యదర్శి ఎరుకల పల్లవి, జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి మండల అధ్యక్షుడు పంబాల రాజు, కమాన్‌పూర్ మండల అధ్యక్షుడు వడ్నాల శ్రీను, అంతర్గాం మండల అధ్యక్షుడు లగిశెట్టి రాకేష్, పాలకుర్తి మండల అధ్యక్షురాలు వడ్నాల జ్యోతి రాజు, ఎలిగేడు మండల అధ్యక్షుడు శివకృష్ణ, ధర్మారం మండల అధ్యక్షుడు బోనగిరి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.