- District News
- బాన్సువాడలో జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ
బాన్సువాడలో జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ
కామారెడ్డి జిల్లా,బాన్సువాడలోని ఎస్.ఆర్.ఎన్.కె. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 29, 30 తేదీల్లో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మీడియా అకాడమీ కార్యదర్శి నాగుల్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు.
శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, శిక్షణలో చర్చించనున్న అంశాలు, జర్నలిస్టులకు అందించనున్న శిక్షణ వివరాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌కు మీడియా అకాడమీ కార్యదర్శి నాగుల్లపల్లి వెంకటేశ్వరరావు, ఛైర్మన్ ఓఎస్డీ రహ్మాన్, మేనేజర్ శైలేష్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ను కలిసి శిక్షణ కార్యక్రమానికి ఆహ్వానించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యలు, అవసరాలను కూడా మీడియా అకాడమీ కార్యదర్శి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
సెప్టెంబర్ 29, 30 తేదీల్లో నిర్వహించే శిక్షణలో సుమారు ఎనిమిది ముఖ్యమైన అంశాలపై నిపుణులతో జర్నలిస్టులకు శిక్షణ అందించనున్నారు. సమాచార హక్కు చట్టం, తప్పొప్పుల పరిశీలన, నేర వార్తల కవరేజ్, వార్తా కథనాల రూపకల్పన, వార్తా సేకరణ, వార్తల ప్రాధాన్యత నిర్ణయం, వాస్తవ నిర్ధారణ, మీడియా చట్టాలు–నైతిక నియమాలు, జర్నలిజంలో పాటించాల్సిన వృత్తిపరమైన ప్రమాణాలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
జర్నలిజం రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించడమే ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని మీడియా అకాడమీ కార్యదర్శి తెలిపారు. శిక్షణ ద్వారా పొందే జ్ఞానం జర్నలిస్టులు తమ రోజువారీ వృత్తి విధుల్లో మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు రోజున నిర్వహించనున్న ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మీడియా అకాడమీ కార్యదర్శి ఆహ్వానించారు. ముగింపు కార్యక్రమానికి హాజరై జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడేందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మీడియా అకాడమీ కార్యదర్శి నాగుల్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు.
