- District News
- Khammam
- కల్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలి
కల్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలి
ఎండీవో కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నిరసన – ప్రభుత్వానికి వినతిపత్రం
ఖమ్మం జిల్లా, కామేపల్లి, ఆగస్టు 17 (లోకల్ గైడ్):
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిరంతరాయంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కామేపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి బానోత్ హరిప్రియ నాయక్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
బీఆర్‌ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు అంతోటి అచ్చయ్య, కామేపల్లి గ్రామ శాఖ నాయకులు కన్నమాల రాంబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఎండీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పేద కుటుంబాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలని కోరుతూ ఎండీవోకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అంతోటి అచ్చయ్య మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకాల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిందని తెలిపారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కల్యాణ లక్ష్మి పథకం కింద అందించే ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ హామీని విస్మరించిందని అచ్చయ్య విమర్శించారు. పేదల ఆడపిల్లల వివాహాలకు ఎంతో అండగా నిలిచిన సంక్షేమ పథకాలను బలహీనపరిచే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై హైకోర్టులో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి సకాలంలో ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పేదలు, రైతులు, మహిళలకు సంబంధించిన సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల నాయకులు సమా మోహన్‌రెడ్డి, మల్లెంపాటి శ్రీనివాస్, కాట్రాల రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి మూడు కృష్ణ ప్రసాద్, బొడంపూడి బుచ్చిబాబు, కృష్ణారెడ్డి, సర్పంచ్ నాగమణి, కిషన్, ముత్తబోయిన రామూర్తి, చిప్పలపల్లి ప్రసాద్, అనూరి ప్రసాద్, మంచల వెంకన్న, తాటిపల్లి నరసింహారావు, షేక్ నాగుల్ మీరా, మంద రాజు, బానోత్ రవి, గునిగంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
