_75 సార్లు రక్తదానం చేసిన డాక్టర్ మణిమణి ఆనంద్ కుమార్‌కు బెస్ట్ సోషల్ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డు

_20 ఏళ్లుగా రక్తదాన సేవలు.. సమాజ సేవకు గుర్తింపుగా ఘన సన్మానం

Published On
_75 సార్లు రక్తదానం చేసిన డాక్టర్ మణిమణి ఆనంద్ కుమార్‌కు బెస్ట్ సోషల్ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డు

 

 

కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 20 (లోకల్ గైడ్ ప్రతినిధి)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ టౌన్‌లోని పీఎస్ ఫంక్షన్ హాల్‌లో భారత్ రక్తదాన్ సేవా సమితి అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాతలు, సమాజ సేవకులకు బెస్ట్ సోషల్ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డు–2026 ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అత్యధికంగా రక్తదానం చేసిన రక్తదాతలు, సామాజిక సేవకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శ్రీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మణిమణి ఆనంద్ కుమార్ గత 20 సంవత్సరాలుగా స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు 75 సార్లు రక్తదానం చేసి, ఆపదలో ఉన్న పలువురికి రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడేందుకు తనవంతు సహకారం అందించినందుకు ఆయనకు బెస్ట్ సోషల్ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డు–2026తో పాటు ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ మణిమణి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. అవసరమైన సమయంలో సాటి మనిషికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు.కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన గౌతమ్ సరోనేట్ ఎన్జీవో ప్రతినిధులు, వరల్డ్ రికార్డు బ్లడ్ డోనర్ డాక్టర్ సంపత్ కుమార్తో పాటు పలువురు ప్రముఖ రక్తదాతలు, సామాజిక సేవకులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది రక్తదానం చేశారు.
రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రక్తదాతలను భారత్ రక్తదాన్ సేవా సమితి సభ్యులు నవీన్, బాబు, హేమంత్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రక్తదానం పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని నిర్వాహకులు పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News