- District News
- నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
నిర్మాణ పనుల జాప్యంపై కలెక్టర్ అసంతృప్తి ..
–
వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి ఆగస్ట్ 12:
వనపర్తి జడ్పీహెచ్‌ఎస్ బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు .బుదవారం వనపర్తి పట్టణంలో నిర్మాణంలో ఉన్న జడ్పీహెచ్‌ఎస్ బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించిన కలెక్టర్, ఇప్పటివరకు పూర్తయిన పనులు, నిర్మాణ పనుల పురోగతి, చేపట్టాల్సిన పనుల వివరాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో వేగంగా సాగకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ప్రారంభించి ఇప్పటికే చాలా కాలం గడిచినందున ఇకపై ఎలాంటి జాప్యానికి తావులేకుండా పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన నేపథ్యంలో పాఠశాల, జూనియర్ కళాశాల భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడంపై ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేసి, నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ అంచనాలను పెంచకుండా, ఇప్పటికే ఉన్న అంచనాల ప్రకారమే పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోగా బేస్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చేపట్టాల్సిన ప్రతి పనికి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణ షెడ్యూల్‌ను సిద్ధం చేసి సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి భవన నిర్మాణ పనులను లక్ష్యాల మేరకు పూర్తి చేసి, విద్యార్థులకు సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి చెప్పారు. కలెక్టర్ తో పాటు జెడ్పి సీఈవో యాదయ్య, ఈడబ్ల్యుఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు, ఇతర విద్యాశాఖ అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
