- District News
- గాంధీ స్ఫూర్తితో రక్తదానానికి శ్రీకారం.
గాంధీ స్ఫూర్తితో రక్తదానానికి శ్రీకారం.
గాంధీ, శాస్త్రి జయంతి సందర్భంగా తాండూరులో ఉచిత రక్తదాన శిబిరం
లోకల్ గైడ్/తాండూర్:
జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శుక్రవారం ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం, మార్వాడి యువ మంచ్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా పాల్గొని సుమారు 50 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోటం మురళీకృష్ణ మాట్లాడుతూ...రక్తహీనతతో బాధపడుతూ అత్యవసర సమయంలో రక్తం అందక ఇబ్బందులు పడుతున్న వారి ప్రాణాలను కాపాడాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారికి సహాయం అందించవచ్చని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, లాల్బహదూర్ శాస్త్రి చూపిన ఆదర్శ మార్గాన్ని అనుసరించాలని కోట మురళి సూచించారు. సమాజ సేవలో యువత మరింత చురుకుగా పాల్గొనాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కిరణ్తో పాటు సంఘం ప్రతినిధులు, మార్వాడి యువ మంచ్ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.
