మా భూమిని ఫోర్జరీ పత్రాలతో అమ్మేశారు..!

అసలు వారసులం మేమే.. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం

మాజీ సర్పంచ్ సుందరి అనిల్ పై సంచలన ఆరోపణలు
Published On
మా భూమిని ఫోర్జరీ పత్రాలతో అమ్మేశారు..!

 

 

 

లోకల్ గైడ్,వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

కోట్‌పల్లి మండలం బార్వాద్‌ గ్రామంలోని సర్వే నంబర్‌ 251లో ఉన్న 5 ఎకరాల 10 గుంటల భూమికి సంబంధించి వివాదం కొనసాగుతోంది. ఈ భూమి తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా సంక్రమించిందని, తామే అసలైన వారసులమని పేర్కొంటూ వారసులు ఆరోపించారు. మంగళవారం వికారాబాద్‌ గెస్ట్‌హౌస్‌లో గ్రామస్తులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ భూమికి సంబంధించి కొందరు నకిలీ పత్రాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఇతరులకు విక్రయించారని ఆరోపించారు. అమ్జద్, ఫైజు, సుందరి అనిల్‌ కలిసి తమ భూమికి సంబంధించిన ఫోర్జరీ పత్రాలు తయారు చేసి, భూమిని ఇతరులకు విక్రయించినట్లు వారసులు ఆరోపించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులతో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైందని వారు పేర్కొన్నారు. తమ పూర్వీకుల భూమిని కాపాడుకునేందుకు అవసరమైన అన్ని ఆధారాలతో చట్టపరమైన పోరాటం చేస్తున్నామని వారసులు తెలిపారు. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని, న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భూమికి సంబంధించిన పత్రాలపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను, రెవెన్యూ అధికారులను కోరారు. తమ భూమిని కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడతామని, న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని భూమి వారసులు స్పష్టం చేశారు.

ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు: అయ్యూబ్ అన్సారి

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకుడు అయ్యూబ్ అన్సారి మాట్లాడుతూ.. తాను రైతులను ఇంతకుముందు కలవలేదని తెలిపారు. తనపై బురదజల్లే ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ విషయంలోనూ వివాదం

కరీంపూర్ గ్రామానికి చెందిన ఆశయ్య మాట్లాడుతూ.. మాజీ సర్పంచ్ సుందరి అనిల్‌ దళితుల కోసం ఎలాంటి పని చేయలేదని ఆరోపించారు. తాను క్రిస్టియన్ అయినపట్టికీ దళితుడనే పేరును కావాలనే ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కోసం కరీంపూర్ గ్రామ పంచాయతీ తీర్మానాలు చేసినట్లు తెలిపారు. అయితే అనంతరం దానిని చర్చిగా మార్చడంతో నిధులు నిలిచిపోయాయని ఆరోపించారు. దళితులపై ప్రేమ ఉంటే ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను చర్చిగా ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ఎంబీ రికార్డుల్లో కూడా ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు సంబంధించిన నమోదు ఉన్నట్లు, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆశయ్య తెలిపారు. ఈ సమావేశంలో కరీంపూర్ గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News