- District News
- తెలంగాణ భాష, సాహిత్యానికి కాళోజీ విశిష్ట సేవలు
తెలంగాణ భాష, సాహిత్యానికి కాళోజీ విశిష్ట సేవలు
కాళోజీ ఆశయాలను భావితరాలకు అందించాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, లోకల్ గైడ్ న్యూస్ (భద్రాద్రి జిల్లా బ్యూరో) :
ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి, సామాజిక చైతన్యానికి విశిష్ట సేవలు అందించారని కలెక్టర్ తెలిపారు. ఆయన కేవలం కవి మాత్రమే కాకుండా సామాజిక ఉద్యమకారుడిగా, ప్రజా చైతన్యవేత్తగా ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. తెలంగాణ మాండలిక భాషలో సామాజిక సమస్యలు, సామాన్య ప్రజల కష్టాలు, ఆశలు, ఆకాంక్షలను తన రచనల్లో ప్రతిబింబించినందుకే ప్రజాకవి అనే బిరుదు లభించిందన్నారు. కాళోజీ రచనలు ప్రజల్లో ధైర్యం, సామాజిక అవగాహన, చైతన్యాన్ని పెంపొందించాయని తెలిపారు. అన్యాయాలు, అసమానతలపై తన రచనల ద్వారా గళమెత్తిన కాళోజీ ఆలోచనలు నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ పురస్కారం లభించడం గర్వకారణమని, కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించడం ఆయనకు లభించిన అత్యున్నత గౌరవమని పేర్కొన్నారు. యువత కాళోజీ జీవితం, రచనలు, ప్రజా ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్రను తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు. తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మావతి, కలెక్టరేట్ ఏఓ అనంత రామకృష్ణ, సీపీఓ సునీత, ఓఎస్డీ వెంకటరమణతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
