- District News
- Khammam
- అంబులెన్స్‌కూ అందని ఏజెన్సీ!
అంబులెన్స్‌కూ అందని ఏజెన్సీ!
చీమలపాడు–లక్ష్మీపురం పాత తడకలపూడి రహదారి అధ్వానం.. తక్షణమే నిర్మించాలని గిరిజన సంఘం డిమాండ్
కారేపల్లి, సెప్టెంబర్ 26 (లోకల్ గైడ్ న్యూస్):
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారుల దుస్థితిపై తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం మండల నాయకులు వజ్జ రామారావు, అజ్మీర శోభన్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చీమలపాడు నుంచి టేకులపల్లి మండలం లక్ష్మీపురం పాత తడకలపూడి వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారి పూర్తిగా గుంతలమయమై, రాకపోకలకు తీవ్ర అవరోధంగా మారిందని తెలిపారు. ఈ మార్గంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్‌కు సైతం సరైన రహదారి సౌకర్యం లేక వందలాది మంది గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జైత్రం తండా గ్రామపంచాయతీ పరిధిలో రహదారి మరింత దారుణంగా తయారైందని, వర్షపు నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తోందన్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు, కీటకాలు, పాముల బెడద పెరిగిందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు కూడా గ్రామాలకు చేరుకోలేని స్థితి నెలకొందని, దీంతో గర్భిణీలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా ఏజెన్సీ గ్రామాల రహదారి సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని విమర్శించారు. చీమలపాడు–లక్ష్మీపురం పాత తడకలపూడి రహదారిని వెంటనే పూర్తిస్థాయిలో పునర్నిర్మించాలని, జైత్రం తండాలో శాశ్వత డ్రైనేజీ ఏర్పాటు చేయాలని, ఏకలవ్య మోడల్ స్కూల్ హాస్టల్‌కు ప్రత్యేక రహదారి కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే రోడ్డుపై బైఠాయించి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మూడు చిన్న, తిప్పల కృష్ణ, ములక రమేష్, ఆవుల వెంకటేష్, తిప్పల రణదేవ్ తదితరులు పాల్గొన్నారు.
