- District News
- Khammam
- పేదలపై నిర్లక్ష్యం.. హామీలు బేఖాతర్!
పేదలపై నిర్లక్ష్యం.. హామీలు బేఖాతర్!
హామీల అమలులో ప్రభుత్వం విఫలం — తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 11, లోకల్ గైడ్ న్యూస్ :
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు విమర్శించారు. మాణిక్యారంలో గురువారం రాత్రి జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తయినా అనేక హామీలను నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సాయం, ఉపాధి హామీ పనులను 150 రోజులకు పెంచడం, రోజుకు రూ.400 కూలి వంటి హామీలు అమలు కాలేదన్నారు. పేద మహిళలకు నెలకు రూ.2,500, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఆర్థిక సాయం, ఆసరా పింఛన్ల పెంపు వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. ఉపాధి హామీ పనులను వెంటనే ప్రారంభించి సంవత్సరానికి 200 రోజుల పని కల్పించడంతో పాటు రోజుకు రూ.600 కూలి చెల్లించాలని డిమాండ్ చేశారు. వాతావరణ పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు పనులు తగ్గుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. నిత్యావసర ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని చౌకధరల దుకాణాల ద్వారా బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర వస్తువులు అందించాలని, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల బియ్యం పథకాన్ని కొనసాగించాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడత బిల్లులు వెంటనే చెల్లించి, రెండో విడతలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులకు హక్కు పత్రాలు అందించాలని, గ్రామాల్లో రహదారులు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులకు నిధులు కేటాయించాలని కోరారు. దళిత, గిరిజన ఆవాస ప్రాంతాల అభివృద్ధికి గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు అవసరమైన నిధులు కేటాయించాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలను ఐక్యం చేసి ఆందోళనలు, పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో యనమనగండ్ల రవి, కేసగాని ఉపేందర్, పండగ కొండయ్య, కరపటి సీతారాములు, పోతర్ల నాగేశ్వరరావు, చల్ల మల్లమ్మ, భూక్య రమేష్, పాయం వెంకన్న, షేక్ సైదులు, దాసరి మల్లయ్య, పాసిని నాగేశ్వరరావు, అన్నారపు కృష్ణ, పోతురాజు చందర్రావు, రేమల్ల వీరస్వామి, కరపటి అరుణ, ఈసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
