- District News
- Ranga Reddy
- ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి
ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి
రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ): రాబోయే ఖరీఫ్ 2026-27 ధాన్యం సేకరణ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌లో ఖరీఫ్ ధాన్యం సేకరణపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీ నాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, ఇతర సౌకర్యాలను ముందుగానే ఏర్పాటు చేయాలని, కనీస మద్దతు ధర, ధాన్యం నాణ్యత ప్రమాణాలు, కొనుగోలు విధానానికి సంబంధించిన వివరాలను స్పష్టంగా ప్రదర్శించేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వం గుర్తించిన సన్న రకం ధాన్యం వివరాలను పోర్టల్‌లో ఖచ్చితంగా నమోదు చేసి సంబంధిత కొనుగోలు కేంద్రాలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను ఎటువంటి జాప్యం లేకుండా ఏర్పాటు చేయాలని తెలిపారు. డి ఆర్ డి ఓ సహకార శాఖలు సెప్టెంబర్ 30వ తేదీలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్దేశించిన 16 మౌలిక సదుపాయాల ప్రమాణాలు తప్పనిసరిగా అమలయ్యేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులతో ముందస్తు సమన్వయం చేసుకొని, ప్రారంభంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ధాన్యం కొనుగోలు అనంతరం రైస్ మిల్లులకు తరలించేందుకు అవసరమైన హమాలీలు, లారీలను ముందుగానే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిబంధనలు, ధాన్యం నాణ్యత ప్రమాణాలు, గ్రేడింగ్ తదితర అంశాలను కచ్చితంగా పాటించాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి వనజాత, ఇంచార్జీ డిఎం సివిల్ సప్లయ్ స్వప్న, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి మహమ్మద్ రియజుద్దీన్, డి.సి.సి.ఓ సుధాకర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
