తీజ్ పండుగ బంజారా సంస్కృతికి ప్రతీక: భాగ్యనగర్ సర్పంచ్ బానోత్ హీరాలాల్

భాగ్యనగర్ తండాలో ఘనంగా తీజ్ వేడుకలు.. సంప్రదాయ నృత్యాలతో అలరించిన యువతులు

Published On
తీజ్ పండుగ బంజారా సంస్కృతికి ప్రతీక: భాగ్యనగర్ సర్పంచ్ బానోత్ హీరాలాల్

 




ఖమ్మం జిల్లా , కారేపల్లి , ఆగస్టు 23 ( లోకల్ గైడ్ ) :

బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని భాగ్యనగర్ తండా సర్పంచ్ బానోత్ హీరాలాల్ అన్నారు. ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతితో మమేకమై జీవించే బంజారా సమాజంలో తీజ్ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. భాగ్యనగర్ తండాలో తొమ్మిది రోజులుగా తీజ్ పండుగ వేడుకలను యువతులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు చేస్తూ తీజ్ పండుగ సంప్రదాయాలను కొనసాగించారు. శనివారం నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతలకు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బంజారా సంప్రదాయ నృత్యాలతో యువతులు, మహిళలు సందడి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ హీరాలాల్ మాట్లాడుతూ.. బంజారా సమాజం అనాదిగా ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతితో మమేకమై జీవిస్తోందన్నారు. తమ జీవన విధానంలో భూమి, పంటలు, పశుసంపదకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. తీజ్ పండుగ ద్వారా ప్రకృతి పట్ల తమకున్న అనుబంధాన్ని చాటుకోవడంతో పాటు బంజారా సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తున్నామని తెలిపారు. తీజ్ పండుగ గ్రామంలోని ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యతను చాటుతుందని అన్నారు. యువతులు తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, చివరి రోజు సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు గుగులోత్ భీముడు నాయక్, బానోత్ రాందాస్ నాయక్, లకావత్ దామ్లా, భగవాన్ దాస్, హతీయ, బాబా, తోప్య, బానోత్ రాంచందర్, బానోత్ మంగీలాల్, లావుడ్యా ఈర్య, భూక్యా తారాచంద్, వీరన్న, గాంధీ, రాంబాబు, గోబ్రియ, బాబు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Tags:

About The Author

Latest News