- District News
- Khammam
- చిన్నారి హర్షకు రూ.3 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం
చిన్నారి హర్షకు రూ.3 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం
ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చొరవతో ఎల్‌వోసీ మంజూరు
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 12, లోకల్ గైడ్ న్యూస్ : ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా సాయికుమార్–మౌనిక దంపతుల కుమారుడు హర్ష జన్మించిన నాటి నుంచి గుండెకు రంధ్రం (ఏఎస్‌డీ/వీఎస్‌డీ) సమస్యతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి హర్షకు శస్త్రచికిత్స, ఇతర వైద్య చికిత్సల కోసం సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి వైద్య ఖర్చులు భారంగా మారడంతో కుటుంబ సభ్యులు గ్రామ సర్పంచ్ గుగులోత్ వరలక్ష్మి రాజును సంప్రదించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ వెంటనే స్పందించి చిన్నారి పరిస్థితిని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబ పరిస్థితిని, చిన్నారి ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా రూ.3 లక్షల ఎల్‌వోసీ మంజూరు చేయించేందుకు చొరవ చూపారు. దీంతో చిన్నారి హర్షకు మెరుగైన వైద్యం అందించేందుకు కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది. ప్రజా సమస్యలపై తక్షణ స్పందన: ప్రజలకు ఏ ఆపద వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కృషి చేస్తున్నారని గ్రామస్థులు పేర్కొన్నారు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్, ఎల్‌వోసీల ద్వారా వైద్య సహాయం అందేలా చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సందర్భాల్లో అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. చిన్నారి హర్ష వైద్య చికిత్సకు రూ.3 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌వోసీ మంజూరు చేయించడంపై ఉసిరికాయలపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌కు, సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి సహాయం అందేలా కృషి చేసిన సర్పంచ్ గుగులోత్ వరలక్ష్మి రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
